శివసేన (యూబీటీ)కి 21, కాంగ్రెస్17: మహారాష్ట్రలో సీట్ షేరింగ్ ఖరారు

by samatah |
శివసేన (యూబీటీ)కి 21, కాంగ్రెస్17: మహారాష్ట్రలో సీట్ షేరింగ్ ఖరారు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి మధ్య ఎట్టకేలకు సీట్ షేరింగ్ ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాలకు గాను శివసేన(యూబీటీ) 21, కాంగ్రెస్ 17, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) వర్గం 10 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ముంబైలో ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీట్ షేరింగ్ ఫార్ములాను ప్రకటించారు. గతంలో వివాదం నెలకొన్న ముంబై సౌత్ సెంట్రల్, భివాండీ, సాంగ్లీ, సతారా స్థానాలకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిపారు. గతంలో సీట్ల పంపకం విషయంపై ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ అవి సత్పలితాలు ఇవ్వలేదు. దీంతో గత నెలలో 17 మందితో శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీట్ షేరింగ్ ఖరారు కాకముందే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని మండిపడింది. ఈ నేపథ్యంలోనే మరోసారి చర్చలు జరిపి సీట్ షేరింగ్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

నియంతృత్వ పాలనను అంతం చేస్తాం: నానా పటోలే

నియంతృత్వ పాలనను అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే అన్నారు. వివాదాస్పద సీట్లపై సామరస్య పూర్వకంగా సర్దుబాటు చేశామని తెలిపారు. సీట్ షేరింగ్‌కు సహకరించిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఏ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ మాట్లాడుతూ కూటమిలో ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. పరస్పర ఒప్పందం తర్వాత సీట్ల పంపకం ప్రకటించామని తెలిపారు.

Advertisement

Next Story