మోడీ మారిపోయిన మనిషి: శరద్ పవార్

by S Gopi |
మోడీ మారిపోయిన మనిషి: శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని మోడీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వేలు పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని గతంలో మోడీ చేసిన ప్రకటనను గుర్తుచేసుకున్న పవార్, ఇప్పుడు మోడీ అనుసరిస్తున్న 'భిన్నమైన వైఖరి' పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మహారాష్ట్రలోని పూణె జిల్లా బారామతి పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రసంగించిన పవార్.. వ్యక్తిగత దాడులు, భిన్నమైన భావజాలం ఉన్న వారిపై తీసుకుంటున్న చర్యల విషయంలో మోడీపై మండిపడ్డారు. 'నేను కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నేను గుజరాత్‌కు ఎంతో సాయం చేశాను. ఆరోజు మోడీ ఏ పార్టీ వాడనే సంగతి చూడలేదు. తన రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉండాలని భావించాను. అందుకే సాయం చేశానని' చెప్పారు. ఒకసారి బారామతికి ఆహ్వానించిన సమయంలో మోడీ ప్రసంగిస్తూ.. పవార్ సాహెబ్ నా వేలు పట్టుకుని అభివృద్ధి చేయమని నేర్పించారని అన్నారు. కానీ, ఇప్పుడు అతను భిన్నంగా చూస్తున్నాడని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ తెలిపారు. ఎవరైన మోడీని విమర్శించడం లేదా భిన్న వైఖరిని తీసుకుంటే వారిని జైలుకు పంపుతున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసులను పవార్ ఉదహరించారు. ఇలా ప్రవర్తించడం ప్రాజాస్వామ్యం కాదు, నియంతృత్వ ధోరణి అని పేర్కొన్నారు. అధికారం ఒక వ్యక్తి చేతిలోకి వెళ్తే భ్రష్టుపడుతుంది. ఎక్కువ మంది చేతిలో అధికారం ఉంటే అందుకు అవకాశం ఉండదని పవార్ వెల్లడించారు.

Advertisement

Next Story