సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బ.. పళని స్వామికే పార్టీ బాధ్యతలు

by Vinod kumar |
సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రికి ఎదురుదెబ్బ.. పళని స్వామికే పార్టీ బాధ్యతలు
X

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ బాధ్యతల కోసం ఇద్దరు నేతల మధ్య జరిగిన పోరుకు ఎట్టకేలకు తెరపడింది. పార్టీ బాధ్యతలను ఎడప్పాడి పళనిస్వామికే (ఈపీఎస్) అప్పజెబుతూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు (ఓపీఎస్) ఎదురుదెబ్బ తగిలినట్టయింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా పళనిస్వామి ఎన్నిక సరైందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగాలని మద్రాసు హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.

గతేడాది అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. దీంతో పన్నీర్ సెల్వం వర్గం మద్రాసు హై కోర్టును ఆశ్రయించింది. మద్రాసు హై కోర్టు పళనిస్వామిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీంతో పన్నీర్ సెల్వం వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే జూలైలో జరిగిన వివాదాస్పద జనరల్ కౌన్సిల్ సమావేశంలో నిబంధనలకు సంబంధించిన మార్పులను పరిగణనలోకి తీసుకున్నాక మద్రాస్ హై కోర్టు ఆదేశాలను సుప్రీం సమర్థించింది.

పన్నీర్ సెల్వం పిటిషన్‌ను కొట్టివేసింది. 'న్యాయం గెలిచింది. ద్రోహుల ముసుగు తొలగిపోయింది. పన్నీర్ సెల్వంతో ఇక ఎటువంటి సంబంధం లేదు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. తన తదనానంతరం వందేళ్ల పాటు అన్నాడీఎంకే కొనసాగుతుందని జయలలిత ప్రకటించారు. సుప్రీం ఉత్తర్వులు దాన్ని నిజం చేశాయి' అని పళనిస్వామి అన్నారు.

అన్నాడీఎంకే వ్యవస్థాపకురాలు జయలలిత మరణం తర్వాత ఏర్పడిన తిరుగుబాటుకు ఈ తీర్పు తాజా మలుపు అని చెప్పవచ్చు. తొలుత పన్నీర్ సెల్వం ఆమెకు వారసుడిగా కొనసాగారు. తర్వాత పళనిస్వామి తెరపైకి వచ్చారు. అప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో అధికార పోరు కొనసాగుతోంది. సుప్రీం తీర్పుతో పళనిస్వామి మద్దతుదారులు చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. పళనిస్వామి భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును చారిత్రకమైనదిగా అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి జయకుమార్ అభివర్ణించారు.

Advertisement

Next Story

Most Viewed