'దేశ భిన్నత్వానికి యూసీసీతో ముప్పు'.. లా కమిషన్‌ ఛైర్మన్‌‌కు తమిళనాడు సీఎం లేఖ

by Vinod kumar |
దేశ భిన్నత్వానికి యూసీసీతో ముప్పు.. లా కమిషన్‌ ఛైర్మన్‌‌కు తమిళనాడు సీఎం లేఖ
X

చెన్నై : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. దాని అమలు వల్ల తలెత్తే ప్రతికూల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్ రితురాజ్ అవస్థికి లేఖ రాశారు. దేశ భిన్నత్వానికి యూసీసీతో ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూసీసీలోని ‘అందరికీ ఒకే విధానం’ అనే ప్రాతిపదికను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ‘అందరికీ ఒకే విధానం’ అనే ప్రాతిపదిక.. సమాజంలోని భిన్న వ్యవస్థలు, సామాజిక వర్గాల జీవనశైలిని సవాలు చేసేలా ఉందన్నారు. సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను పరిగణనలోకి తీసుకోకుండా యూసీసీని అమలు చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని 'లా కమిషన్‌' ఛైర్మన్‌‌కు రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు.

‘భిన్న సంప్రదాయాలు, భిన్న ఆచారాలు కలిగిన సమాజంగా పేరొందిన భారత్‌లో యూసీసీని అమలు చేయాలనే ఆలోచన సరికాదు. ఆర్టికల్‌ 29ని అనుసరించి మైనార్టీ హక్కులను కాపాడుతూ, వాటిని గౌరవిస్తున్న భారత్‌ లౌకిక దేశంగా గర్విస్తోంది. జిల్లా, ప్రాంతీయ మండళ్ల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు వారి సంప్రదాయాలు, పద్ధతులను కాపాడుకునే వెసులుబాటునూ రాజ్యాంగం కల్పిస్తోంది. గిరిజన వర్గాలనూ యూసీసీ ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు. కాగా, యూసీసీపై పౌరులు, సంస్థలు అభిప్రాయాలను తెలియజేసే గడువు జులై 14తో ముగియనుంది.

Advertisement

Next Story

Most Viewed