ఆర్ఎస్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు.. నేడు మోహన్ భగవత్‌తో యోగి భేటీ

by Hajipasha |
ఆర్ఎస్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు..  నేడు మోహన్ భగవత్‌తో యోగి భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీపై ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన పనితీరుకు అహంకారమే కారణమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ సమీపంలో ఉన్న కనోటాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రామభక్తితో మెలిగేవారు క్రమంగా అహంకారులుగా మారారు. అహంకారం వల్లే రాముడు 241 వద్దే ఆపాడు. 2014 తర్వాత బీజేపీకి ఇదే అత్యంత దారుణమైన ఫలితం’’ అని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి ‘‘రాముడికి వ్యతిరేకం’’గా నిలిచిందని విమర్శించారు. దేవుడి న్యాయం నిజం, ఆనందదాయకం అని ఇంద్రేష్ చెప్పారు.

మోహన్ భగవత్ వ్యాఖ్యలతో..

ప్రజాసేవలో వినయం యొక్క ప్రాముఖ్యతపై ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ‘‘నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఇతరులకు ఎలాంటి హానిని కలిగించకుండా పని చేసుకుంటూ ముందుకు సాగుతాడు’’ అని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకుగానూ ఈసారి బీజేపీకి 33 సీట్లే వచ్చాయి. ఈ ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్‌‌‌లో ఇటీవలే ఓ సంచలన వ్యాసం పబ్లిష్ అయింది. ‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయి. వీరితో పాటు నేతలంతా ‘గాలి బుడగ’ను నమ్ముకొని పని చేశారు. మోడీ పేరుపైనే పూర్తిగా ఆధారపడ్డారు. వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదు’’ అని ఆ వ్యాసంలో ప్రస్తావించారు. ఈనేపథ్యంలో శనివారం రోజు (జూన్ 15న) ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, యూపీలో ఆర్ఎస్ఎస్ విస్తరణ వంటి అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉంది.

Advertisement

Next Story