PM Modi : హైదరాబాద్, కాకినాడకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎల్ఐ ప్రాజెక్టులు మంజూరు

by Hajipasha |
PM Modi : హైదరాబాద్, కాకినాడకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎల్ఐ ప్రాజెక్టులు మంజూరు
X

దిశ, నేషనల్ బ్యూరో : ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం(Ayurveda Day) సందర్భంగా మంగళవారం (అక్టోబరు 29) దాదాపు రూ.12,850 కోట్లు విలువైన ఆరోగ్య రంగ ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Modi) ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమం వేదికగా ఈ ప్రాజెక్టులను వర్చువల్‌గా ఆయన ప్రారంభిస్తారు. వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్‌ ఉత్పత్తి చేసే కంపెనీలకు సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ)ను అమలు చేస్తోంది. ఈ స్కీం కింద ఐదు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ పచ్చజెండా ఊపనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, కాకినాడ, వాపి (గుజరాత్), బెంగళూరు (కర్ణాటక), నాలాఘర్ (హిమాచల్ ప్రదేశ్)లలోని యూనిట్లలో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) స్కీంలో భాగంగా 70 ఏళ్లకు పైబడిన వారికి హెల్త్ కవరేజీని అందించే అంశంపైనా ఈసందర్భంగా ప్రధాని ప్రకటన చేయనున్నారు. దేశంలోని గర్భిణులు, 16 ఏళ్లలోపు బాలలకు 12 వ్యాక్సిన్లను అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేసే ప్రత్యేక ‘యూ-విన్’ పోర్టల్‌ను మోడీ ప్రారంభిస్తారు.

11 ప్రముఖ వైద్య సంస్థల్లో డ్రోన్ సర్వీసులు

దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, వైద్య నిపుణులు, వైద్య అనుబంధ రంగాల నిపుణులు, వైద్య సంస్థల సమాచారాన్ని క్రోడీకరించి నిల్వ చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక పోర్టల్‌ను సైతం ప్రధాని ప్రారంభిస్తారు. కొవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ సమాచారం మన దేశానికి ఉపయోగపడనుంది. ఒడిశాలోని గోథపట్న గ్రామంలో నిర్మించిన సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీని ఆయన ప్రారంభిస్తారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో కొత్తగా నిర్మించిన పంచకర్మ హాస్పిటల్, ఆయుర్వేద ఔషధ తయారీ కేంద్రం, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్‌లను ప్రధాని ప్రారంభిస్తారు. దేశంలోని 11 ప్రముఖ వైద్య సంస్థల్లో డ్రోన్ సర్వీసులకు మోడీ పచ్చజెండా ఊపుతారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆయుష్‌ వైద్య సేవలను అందించే నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను బెంగళూరు, ఢిల్లీ, లక్నోలలో ఆయన ప్రారంభిస్తారు. నాలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లకుగానూ రెండింటిని ఢిల్లీలోనే ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed