Hindenburg Report: వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రయత్నమే

by Shamantha N |
Hindenburg Report: వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రయత్నమే
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్ హిండెన్‌ బర్గ్‌ పై సెబీ చీఫ్ మాధబి పురి బచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిత్వాన్ని చంపే విధంగా హిండెన్ బర్గ్ నివేదిక ఉందని పేర్కొంది. తమ ఆర్థిక వ్యవహారాలు వెల్లడిస్తామని.. త్వరలోనే వివరణాత్మకంగా అన్ని విషయాలు చెప్తామని అన్నారు. ఈ మేరకు మాధబి పురి బచ్, ధవర్ బచ్ సంయుక్త ప్రకటన జారీ చేశారు. ‘‘ఆగస్టు 10న హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదికలో మాకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అందులో నిజం లేదు. మా జీవితం తెరిచిన పుస్తకం. అవసరమైన అన్ని వివరాలను ఇప్పటికే సెబీకి అందించాం. మేం ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నప్పుడు జరిగిన ఆర్థిక కార్యకలాపాలు వెల్లడిస్తాం. ఆర్థిక పత్రాలు బహిర్గతం చేసేందుకు సంకోచించం. పూర్తి పారదర్శకత కోసం వాటిపై త్వరలోనే సమగ్ర ప్రకటన జారీ చేస్తాం. హిండెన్‌బర్గ్‌పై సెబీ చర్యలు తీసుకొని షోకాజు నోటీసు జారీ చేసింది. దానికి ప్రతీకారంగా మా వ్యక్తిత్వాన్ని చంపేందుకు ప్రయత్నించడం బాధాకరం ”అని ప్రకటనలో వెల్లడించారు.

సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలు

ఇకపోతే, సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ మనీ సైఫనింగ్ స్కాండల్ లో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్‌షోర్ ఫండ్‌లలో మాధబి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్‌షోర్‌ షెల్‌ సంస్థల వివరాలు తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యకరం అని తెలిపింది. ఇందులో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్‌బర్గ్‌ నివేదికలో ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా వేసింది. అయితే, ఈ నివేదికపై సెబీ చీఫ్ పైవిధంగా స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed