IS : ‘ఇస్లామిక్ స్టేట్’పై బ్యాన్‌ను సవాల్ చేస్తూ పిటిషన్.. జనవరి 22న ‘సుప్రీం’ విచారణ

by Hajipasha |
IS : ‘ఇస్లామిక్ స్టేట్’పై బ్యాన్‌ను సవాల్ చేస్తూ పిటిషన్.. జనవరి 22న ‘సుప్రీం’ విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘ఇస్లామిక్ స్టేట్’(IS), దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు(Supreme Court) జనవరి 22న వాదనలు విననుంది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. 64 ఏళ్ల సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణలో తమకు సహకారాన్ని అందించేందుకు ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ముక్తా గుప్తాను అమికస్ క్యూరీ(amicus curiae)గా సుప్రీంకోర్టు నియమించింది. నాచన్‌ను 2023 డిసెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ విభాగానికి సారథ్యం వహిస్తున్నాడనే అభియోగాలతో అబ్దుల్ హమీద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఆయన ఉన్నారు. నాచన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు రెండుసార్లు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. జైలు నుంచే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పిటిషనర్ సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్ వాదనలు వినిపించారు. చివరిసారిగా డిసెంబరు 4న వాదనలు జరిగాయి.

ఈ పిటిషన్ ఎందుకు వేశాడంటే.. ?

సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్ గతంలో నిషేధిత సంస్థ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి) జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. 2002-2003లో ముంబైలో జరిగిన మూడు బాంబు పేలుళ్ల కేసులో నాచన్ దోషిగా తేలడంతో జైలుశిక్ష పడింది. శిక్షను అనుభవించిన అనంతరం 2017 నవంబరులో జైలు నుంచి అతడు విడుదలయ్యాడు. తాజాగా 2023 డిసెంబరులోనే నాచన్‌ను ఎన్‌ఐఏ మరోసారి అరెస్టు చేసింది. అతడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈనేపథ్యంలో భారత్‌లో ఐఎస్, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై బ్యాన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అబ్దుల్ హమీద్ నాచన్ ఆశ్రయించాడు. ‘‘ఐఎస్‌, దాని అనుబంధ ఉగ్ర సంస్థలపై భారత ప్రభుత్వం విధించిన బ్యాన్ అనేది కొన్ని సైద్ధాంతిక భావజాలాలను, పవిత్ర ఖురాన్‌లోని కొన్ని నిర్దిష్ట పదజాలాలను, ఖలీఫా వ్యవస్థను లక్ష్యంగా చేసుకునేలా ఉంది’’ అని అతడు ఆరోపించాడు.

Advertisement

Next Story

Most Viewed