EVM: ఈవీఎంల సోర్స్ కోడ్‌ను‌ తనిఖీ చేయాలని పిల్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

by Vinod kumar |   ( Updated:2023-09-22 15:19:32.0  )
EVM: ఈవీఎంల సోర్స్ కోడ్‌ను‌ తనిఖీ చేయాలని పిల్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లోని సాఫ్ట్ వేర్ సోర్స్ కోడ్‌ను తనిఖీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈవీఎంలలోని సోర్స్ కోడ్‌తో ముడిపడిన నిబంధనలను ఎన్నికల సంఘం ఉల్లంఘించినట్లుగా నిరూపించే ఆధారాలేవీ పిటిషనర్‌ సునీల్ అహ్యా సమర్పించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం.. ఆ పిటిషన్‌ను కొట్టేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది.

ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురయ్యే ముప్పు ఉన్నందున.. వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సోర్స్ కోడ్‌ను బహిరంగంగా అందుబాటులో ఉంచలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక సునీల్ అహ్యా తన పిటిషన్‌లో.. ‘‘సోర్స్ కోడ్ అనేది ఈవీఎంల మెదడు లాంటిది. ప్రజలు అవే ఈవీఎంలలో ఓట్లు వేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం.. ఈవీఎంల సోర్స్ కోడ్ భద్రతపై ఆడిట్ అవసరం’’ అని వాదించారు. దీనిపై తాను గతంలో ఎన్నికల సంఘానికి మూడు సార్లు ఫిర్యాదు చేసినా సమాధానం రాలేదన్నారు.

Advertisement

Next Story