గుజరాత్ నుంచి రాజ్యసభ బరిలో కేంద్ర మంత్రి..

by Vinod kumar |
గుజరాత్ నుంచి రాజ్యసభ బరిలో కేంద్ర మంత్రి..
X

గాంధీ నగర్: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఆర్. పాటిల్‌తో కలిసి జైశంకర్ రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్‌లో రిటర్నింగ్ అధికారి రీటా మెహతాకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 13వ తేదీ తుది గడువు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 తుది గడువు. అవసరమైతే 24వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జైశంకర్ నాలుగేళ్ల క్రితం తొలిసారి గుజరాత్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ఈ రాష్ట్రంలోని 11 రాజ్యసభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 3 స్థానాలు ఉన్నాయి.

బీజేపీకి చెందిన 8 స్థానాల్లో జైశంకర్, జుగల్జీ ఠాకూర్, దినేష్ అనవడియాల పదవీ కాలం ఆగస్టు 18వ తేదీన ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 182 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో తమకు తగినంత మంది ఎమ్మెల్యేలు లేనందున గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టబోమని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాలు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు మాత్రమే సాధించింది.

రాజ్యసభకు ఆరుగురు టీఎంసీ అభ్యర్థులు..

కోల్‌కతా: రానున్న రాజ్యసభ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులుగా డెరెక్ ఓ బ్రెయిన్, డోలాసేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లాం, ప్రకాశ్ చిక్ బరాక్, సాకేత్ గోఖలే పేర్లను సోమవారం ప్రకటించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 24వ తేదీన ఎన్నికలను ఈసీ ప్రకటించింది. బెంగాల్ నుంచి ఓ బ్రియన్, డోలాసేన్, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి రిటైర్ కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed