Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. రచ్చ..

by Mahesh Kanagandla |
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో రచ్చ.. రచ్చ..
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ(Jammu Kashmir Assembly) గురువారం రసాభాసగా మారింది. ప్రత్యేక హోదా(Special Status) తీర్మానంపై నిరసన సందర్భంగా వెల్ లోకి విపక్ష సభ్యులు దూసుకెళ్లారు. స్పీకర్ సభ్యులను అసెంబ్లీ నుంచి తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ అబ్దుల్ రహీమ్ ఆదేశాల మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు పంపారు. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ స్పీకర్ సభను రోజంతా వాయిదా వేశారు. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బుధవారం ఆమోదించిన తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యలు నిరసన వ్యక్తం చేయడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ తీర్మానంపై మాట్లాడుతుండగా.. అవామీ ఇత్తెహాద్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ ఆర్టికల్ 370(Article 370), 35 (ఏ)లను పునరుద్ధరించాలని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించాడు. దీంతో బీజేపీ సభ్యులు ఆగ్రహంతో వెల్ లోకి దూకి బ్యానర్‌ను లాక్కొని ముక్కలుగా చింపేశారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. అయితే సభ వాయిదా పడిన తర్వాత కూడా బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. సభ ప్రారంభం అయిన తర్వాత కూడా బీజేపీ సభ్యులు నిరసన కొనసాగించారు. స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలు కుర్చీలో కూర్చోవాలని రిక్వెస్ట్ చేసినా వారు వినలేదు. మీరు విపక్ష నేత అని మీరు చెప్పేది వింటామని ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత సునీల్ శర్మతో స్పీకర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు నిల్చొని నిరసన తెలిపారు. అనంతరం ‘బలిదాన్ హువే జహాన్ ముఖర్జీ వో కశ్మీర్ హమారా హై’ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు ఎన్సీ ఎమ్మెల్యే బదులిస్తూ ‘జిస్ కశ్మీర్ కో ఖూన్ సే సీంచా, వో కశ్మీర్ హమారా హై’ అంటూ నినాదాలు చేశారు. ఆందోళనల మధ్య స్పీకర్ వీటన్నింటిని రికార్డు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed