రూ.64.58కోట్ల ఫీజు తిరిగివ్వాలి..ప్రయివేటు స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు

by vinod kumar |
రూ.64.58కోట్ల ఫీజు తిరిగివ్వాలి..ప్రయివేటు స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.64.58కోట్ల ఫీజును తిరిగి చెల్లించాలని 10 ప్రయివేటు పాఠశాలలకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్కూళ్లు నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయని తెలిపింది. జబర్ పూర్ జిల్లాలో ఉన్న పలు పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఘన శ్యామ్ సోనీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం ఓ కమిటీని వేసి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 10 స్కూళ్లు 2018-19 నుంచి 2024-25 మధ్య కాలంలో 81,117 మంది విద్యార్థుల నుంచి రూ.64.58 కోట్ల ఫీజులు వసూలు చేసినట్టు ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫీజును స్టూడెంట్స్‌కు తిరిగివ్వాలని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది.

కాగా, పాఠశాలలు 10శాతానికి పైగా ఫీజులు పెంచాలనుకుంటే జిల్లా అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాగే 15శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ ఈ స్కూళ్లు ఎటుంటి పర్మిషన్ తీసుకోకుండానే ఇష్టానుసారంగా ఫీజులు పెంచినట్టు తేలింది. ఈ క్రమంలోనే చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మే 27న జబల్‌పూర్ జిల్లా యంత్రాంగం వరుసగా ఫీజులు, పాఠ్యపుస్తకాల ధరలను అక్రమంగా పెంచినందుకు పాఠశాల నిర్వాహకులు, కొంతమంది పుస్తకాల షాపు యజమానులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed