Football Fans: ట్రైనీ డాక్టర్ ఘటనపై నిరసనకు దిగిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్

by S Gopi |
Football Fans: ట్రైనీ డాక్టర్ ఘటనపై నిరసనకు దిగిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య వ్యవహారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రం మొదలుకొని దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. తాజాగా ఈ వ్యవహారం క్రీడాభిమానులలోనూ ఆగ్రహాన్ని రాజేసింది. ఆదివారం మోహన్ బాగాన్, ఈస్ట్ బెంగాల్ జట్ల మధ్య మ్చాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా వేలాది మంది అభిమానులు ట్రైనీ డాక్టర్ ఘటనపై ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే శాంత్రిభద్రతల కారణంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మ్యాచ్‌ను రద్దు చేసింది. అయినప్పటికీ ఇరు జట్ల అభిమానులు కోల్‌కతాలోని ఐకానిక్ సాల్ట్ లేక్ స్టేడియం వెలుపల గుమిగూడారు. ఆర్‌జీ కార్ ఆసుపత్రిలో జరిగిన దారుణానికి మృతి చెందిన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారంతా తమ క్లబ్‌ల జెండాలు, పోస్టర్లను ప్రదర్శించారు. అత్యాచార, హత్య ఘటనను వ్యతిరేకిస్తూ వారంతా స్టేడియం వెలుపల జనం గుమిగూడటంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. వైద్యులు పిలుపునిచ్చిన 24 గంటల సమ్మె ఆదివారం ముగియగా, ఢిల్లీ, కోల్‌కతాలో వైద్యాధికారులు తమ ఆందోళనలను కొనసాగించారు.

Next Story