సబ్సిడీ కింద ఉల్లి విక్రయానికి ప్రత్యేక కేంద్రాలు!

by Disha Web Desk 23 |
సబ్సిడీ కింద ఉల్లి విక్రయానికి ప్రత్యేక కేంద్రాలు!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. అఖిల భారత సగటు రిటైల్ ఉల్లి ధరలు గతేడాది కంటే 57 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నిల్వ ఉంచిన ఉల్లి స్టాక్‌ను సబ్సిడీ కింద విక్రయించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రసుతం ఉల్లి ధర దేశవ్యాప్తంగా సగటున రూ. 47కి చేరుకుంది. దీంతో రిటైల్ మార్కెట్‌లలో కిలోకు రూ. 25 సబ్సిడీ రేటుతో నిల్వ ఉన్న ఉల్లిని ప్రత్యేక కేంద్రాల ద్వారా విక్రయించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, గతేడాది ఇదే సమయంలో కిలో ఉల్లి రూ. 30 ఉండగా, ప్రస్తుతం రూ. 47కి చేరింది.

దేశ రాజధాని ఢిలీలో ఉల్లి రిటైల్ ధర శుక్రవారం కిలోకు రూ. 40గా ఉంది. 'మేము ఆగస్టు మధ్య నుంచి ఉల్లి నిల్వలను పెంచాం. ధరల పెరుగుదలను అరికట్టడానికి, వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రస్తుతం రిటైల్ విక్రయాలను వేగవంతం చేస్తున్నాము' అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు నిల్వ ఉన్న స్టాక్‌ను హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లకు తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 22 రాష్ట్రాలకు దాదాపు 1.7 లక్షల టన్నుల ఉల్లిని సరఫరా చేసినట్టు పేర్కొన్నారు. వాతావరణ వల్ల ఖరీఫ్ సీజన్‌లో రైతులు ఉల్లి నాట్లను ఆలస్యంగా వేశారు. దానివల్ల పంట ఆలస్యం కావడం, రబీలో పండింగిన ఉల్లి స్టాక్ అయిపోవడం వంటి కారణాలతో సరఫరా తగ్గింది. దాని ఫలితంగానే హోల్‌సేల్, రిటైల్ ధరలు పెరిగాయని వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed