యూఎన్ఎస్సీలో సంస్కరణలు అవసరం..లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

by vinod kumar |
యూఎన్ఎస్సీలో సంస్కరణలు అవసరం..లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో సంస్కరణలు అవసరమని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో గురువారం జరిగిన10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌లో ఆయన ప్రసంగించారు. బ్రిక్స్ సభ్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తాయన్నారు. యూఎన్ఎస్సీ, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరాన్ని భారత్ పదేపదే నొక్కి చెబుతోందన్నారు. గ్లోబల్ గవర్నెన్స్‌ను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చడానికి ఈ సంస్కరణలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకం చేసేందుకు భారత్ ఎంతో కట్టుబడి ఉందన్నారు. ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరిన ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకు బిర్లా స్వాగతం తెలిపారు. వృద్ధి, సుస్థిర అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో పార్లమెంటేరియన్లు కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed