'బీజేపీ నుంచి డబ్బు రికవరీ చేయండి..' శివసేన ఎంపీ సంజయ్ రౌత్

by S Gopi |
బీజేపీ నుంచి డబ్బు రికవరీ చేయండి.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ తన కార్యాలయాన్ని బీజేపీ తరపున ప్రచారం కోసం ఉపయోగించుకోవడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీకి ఓట్లు వేయడానికి ప్రధాని మోడీ ప్రజా వనరులను ఉపయోగిస్తున్నప్పుడు, ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులను బీజేపీకి పంపాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. బీజేపీ అకౌంట్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. 'ప్రధాని మోడీ తన ప్రయాణాలకు ప్రభుత్వ విమానాన్ని ఉపయోగిస్తుంటే, ఎన్నికల సంఘం ఖర్చుల బిల్లులను బీజేపీకి పంపించి ఆ పార్టీ ఖాతా నుంచి డబ్బులు రికవరీ చేయాలి. గత కొద్ది రోజులుగా ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత నుంచి మోడీ ప్రభుత్వ హెలికాప్టర్లలోనే తిరుగుతున్నారని' అన్నారు.

ప్రధాని ముంబై పర్యటనను సైతం సంజయ్ రౌత్ విమర్శించారు. అదానీకి భూమిని ఇవ్వడం కోసమే మోడీ ముంబై వెళ్లారన్నారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్ట్ గౌతమ్ అదానీకి ఇచ్చారు. కానీ, ముంబై నుంచి బీజేపీని తరిమికొట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే అభిప్రాయమే కనిపిస్తోంది. ముంబైలో వారు పదుల సంఖ్యలో సమావేశాలు నిర్వహించినా బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, తన మాటలను రాసి పెట్టుకోవాలని సంజ్య రౌత్ విమర్శలు గుప్పించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెరాల్, ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. పెద్దలను అగౌరవపరచమని మరాఠీ సంస్కృతి ఎన్నడూ నేర్పించదు. సంజయ్ రౌత్‌కు ప్రాథమిక పౌర జ్ఞానం లేదు. అతని కోసం పౌర పుస్తకాలను పంపిస్తామని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉన్న సమయంలోనూ ఉన్నత పదవిలో ఉన్నవారు తమ విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలి. ఆర్‌బీఐ కార్యక్రమానికి హాజరైన సమయంలో ప్రధాని మోడీ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.

మరోవైపు, ఎన్‌సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్, ఎన్నికల కమిషన్ బీజేపీకి మరో భుజంగా మారిందని, తన ఫిర్యాదులపై చర్య తీసుకోలేదని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఇప్పటికీ చాలా గోడలపై బీజేపీ గుర్తు కనిపిస్తోందని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశానన్నారు.

Advertisement

Next Story

Most Viewed