Re election: ఈవీఎంలపై అనుమానం.. బ్యాలెట్‌తో రీపోలింగ్‌కు గ్రామస్తుల యత్నం!

by vinod kumar |
Re election: ఈవీఎంలపై అనుమానం.. బ్యాలెట్‌తో రీపోలింగ్‌కు  గ్రామస్తుల యత్నం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuthi) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీలు మాత్రం ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించాయి. సోలాపూర్ (Solapur) జిల్లాలోని మార్కర్ వాడి (Markar vadi) గ్రామస్థులు సైతం ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. మల్షిరాస్ (Malshiras) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో తాము బీజేపీకి ఓట్లు వేయకున్నా ఆ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ గ్రామంలో బ్యాలెట్‌తో డమ్మీ రీ పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకున్నారు. బలవంతంగా ఓటు వేయడానికి వెళ్లిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు కూడా వారిపై అభియోగాలు మోపినట్టు తెలిపారు. కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మల్షిరాస్ స్థానం నుంచి ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి ఉత్తమ్ జంకర్ 13,147 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే మార్కర్ వాడి గ్రామంలో ఉత్తమ్‌రావ్ 843 ఓట్లు రాగా, బీజేపీకి చెందిన రామ్ సత్పుటేకు 1003 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story