- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రిజర్వేషన్ కన్ఫార్మ్ అయితేనే ప్లాట్‌ఫామ్ పైకి..

- రద్దీ నియంత్రణకు రైల్వేల కొత్త నిబంధన
- దేశవ్యాప్తంగా 60 స్టేషన్లలో అమలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల రైల్వే స్టేషన్లలో పలు తొక్కిసలాట సంఘటనలు సంభవించిన నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కొత్త నిబందనను ప్రవేశపెట్టనుంది. రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఇకపై వెయిటింగ్ ప్రాంతాలను స్టేషన్ బయట ఏర్పాటు చేయనున్నారు. రైలు వచ్చిన తర్వాత మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతించనున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, వారణాసి, అయోధ్య, పాట్నా స్టేషన్లలో ఈ నిబంధనలను పైలెట్ ప్రాజెక్టు కింద అమలులోకి తెచ్చారు. ఈ రైల్వే స్టేషన్ల ప్రవేశంపై రైల్వే శాఖ పూర్తి అధికారాన్ని కలిగి ఉండనుంది. ఇకపై ఈ రైల్వే స్టేషన్లలో అన్ని అనధికార ఎంట్రీ పాయింట్లను మూసివేయనున్నారు. అంతే కాకుండా కన్ఫార్మ్ రిజర్వేషన్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్ పైకి అనుమతించనున్నారు.
మరోవైపు స్టేషన్లలో మరింత వెడల్పు ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నారు. మహాకుంభమేళా సమయంలో ఇలాంటి వెడల్పాటి ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఎంతో సమర్థవంతంగా పని చేశాయని.. అందుకే ఆయా రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు రద్దీని ఎప్పటికప్పుడు గమనించేందుకు ఈ రైల్వే స్టేషన్లలో సీసీ టీవీల నిఘాను మరింతగా పెంచనుంది. ఆయా రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిఘాను ఏర్పాటు చేయనుంది. మహాకుంభమేళా, ఇతర ప్రత్యేక పర్వదినాల సమయంలో మేజర్ రైల్వే స్టేషన్లలో వార్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రద్దీని నియంత్రించనున్నారు. ప్రతీ మేజర్ స్టేషన్‌లో ఇకపై ఆర్థిక సంబంధమైన విషయాలపై తక్షణమే నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న స్టేషన్ డైరెక్టర్‌ను కూడా నియమించనున్నారు. ఈ అధికారి స్టేషన్ కెపాసిటీ, రైలు లభ్యతను బట్టి టికెట్లను ఎంత వరకు అమ్మాలనే విషయాలను నిర్ణయించనున్నారు. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలోనే రైల్వే శాఖ ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.