Railway : ఉమ్మినందుకు, చెత్త వేసినందుకు రూ.5 కోట్ల జరిమానాలు

by Hajipasha |
Railway : ఉమ్మినందుకు, చెత్త వేసినందుకు రూ.5 కోట్ల జరిమానాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రైల్వే స్టేషన్లలో ఎంతో నిర్లక్ష్యంగా ఉమ్మే వాళ్లను, చెత్త వేసే వాళ్లను మనం చూస్తుంటాం. అలాంటి వారిపై రైల్వేశాఖ ఫైన్ల కొరడా ఝుళిపిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల వ్యవధిలో దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ఉమ్మిన, చెత్తవేసిన దాదాపు 3.30 లక్షల మందిపై జరిమానాలు విధించారు. తద్వారా రైల్వేశాఖకు మొత్తం రూ.5.13 కోట్లకుపైగా జరిమానాలు వసూలయ్యాయి. ఈవివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

ఈ జరిమానా మొత్తాలను పెంచే ఆలోచన ప్రస్తుతం లేదన్నారు. మహిళా ప్రయాణికుల భద్రతను పెంచేందుకు భారతీయ రైల్వే శాఖ "మేరీ సహేలి" పేరిట కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇందులో భాగంగా సుదూర రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక మహిళా ఆర్‌పీఎఫ్ సిబ్బందిని నియమించామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సగటున 700 మంది మహిళా ఆర్‌పీఎఫ్ సిబ్బందితో కూడిన 245 బృందాలు ప్రతిరోజూ "మేరీ సహేలి" కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నాయని వెల్లడించారు.

Advertisement

Next Story