తన ఫోన్ ట్యాప్ అయిందంటూ.. పెగాసస్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-03 06:13:12.0  )
తన ఫోన్ ట్యాప్ అయిందంటూ.. పెగాసస్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణం దాడికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సంస్థాగత నిర్మాణం అవసరమని అభిప్రాయపడ్డారు. లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థులనుద్ధేశించి ‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం’అనే అంశంపై ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

తనపై గూఢచర్యం చేసేందుకు ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై గూఢచర్యం చేయడానికి పెగాసస్‌ను ఉపయోగించిందని అన్నారు. ‘నా ఫోన్లోకి పెగాసస్‌ జొప్పించారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లపైనా నిఘా పెట్టారు. దీనిపై కొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులు నాకు కాల్‌ చేసి.. దయచేసి మీరు ఫోన్లో మాట్లాడేప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ మాటలను రికార్డ్‌ చేస్తున్నాం అని హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా మేం ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం.

ఇక ప్రతిపక్షాలపైన కేసులు సరేసరి. క్రిమినల్‌ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా నాపైనా కేసులు పెడుతున్నారు’అని కేంద్ర సర్కారుపై రాహుల్‌ మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి పార్లమెంట్‌, మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. దీంతో ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed