ఆ పాతిక మందికే ప్రధాని మోడీ అభయహస్తం : రాహుల్ గాంధీ

by Hajipasha |
ఆ పాతిక మందికే ప్రధాని మోడీ అభయహస్తం : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దాదాపు 25 మంది బడా పారిశ్రామిక వేత్తలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను ప్రధానమంత్రి మాఫీ చేయించారని ఆయన ఆరోపించారు. ఆ డబ్బులే ప్రభుత్వ ఖజానాలో ఉండి ఉంటే.. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 24 ఏళ్లపాటు నిధులను కేటాయించగలిగే వాళ్లమని రాహుల్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు తర్వాత తొలిసారిగా ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అదానీ , అంబానీల ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీ పనిచేస్తుంటారని.. రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తమ కుటుంబం దశాబ్దాలుగా పనిచేస్తోందన్నారు. తన కుటుంబానికి రాయ్‌బరేలీ ప్రజలతో బలమైన సంబంధాలు ఉన్నందు వల్లే.. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు రాహుల్ స్పష్టం చేశారు. రాయ్‌బరేలీలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు తన అమ్మమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ పేదల సమస్యల కంటే..పారిశ్రామికవేత్తల కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లు, ఈవెంట్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారని కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ఏటా రూ.లక్ష బ్యాంకు ఖాతాలో వేస్తామని రాహుల్ ప్రకటించారు.

Advertisement

Next Story