GST: ఆరోగ్య బీమాపై జీఎస్టీ అవివేకం.. దానిని రద్దు చేయాలి : రాహుల్ గాంధీ

by Harish |
GST: ఆరోగ్య బీమాపై జీఎస్టీ అవివేకం.. దానిని రద్దు చేయాలి : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని తొలగించాలని ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ హౌస్ వెలుపల ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. లోక్‌సభ పక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దీనిలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్స్ పోస్ట్‌లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు అనారోగ్య సమయాల్లో ఎవరి ముందు తలవంచకుండా ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడటానికి బీమా పాలసీలు ఉపయోగపడతాయి. అయితే మోడీ ప్రభుత్వం ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించే కోట్లాది మంది సామాన్య భారతీయుల నుండి రూ. 24 వేల కోట్లు వసూలు చేసింది. ప్రతి విపత్తు ముందు పన్ను అవకాశాలను వెతుక్కోవడం బీజేపీ ప్రభుత్వ అవివేకానికి నిదర్శనం. ఈ అవకాశవాద ఆలోచనను ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలపై తప్పనిసరిగా జీఎస్టీని తొలగించాలని రాహుల్ ఎక్స్‌లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ జేబీ మాథర్ హౌస్ వెలుపల మాట్లాడుతూ.. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని వర్తింపజేయరాదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని ఏమాత్రం గౌరవించదని అన్నారు. ఇదిలా ఉంటే, జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై విధించిన 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరుతూ గతంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇలాంటి పన్ను విధించడం వల్ల సామాన్య ప్రజలకు ఆర్థిక భారం పెరగడంతో పాటు ఈ రంగం వృద్ధి పరిమితం అవుతుందని ఆయన అన్నారు.

Advertisement

Next Story