రాజకీయాలు తెలుసు.. కానీ కుటుంబీకుల మధ్య వాటికి చోటివ్వం : రాహుల్ గాంధీ

by Hajipasha |
రాజకీయాలు తెలుసు.. కానీ కుటుంబీకుల మధ్య వాటికి చోటివ్వం : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయాల్లో ఉన్నవాళ్లు కనీసం వారివారి కుటుంబాలకు గౌరవం ఇవ్వలేకపోతే.. బయట కూడా సత్సంబంధాలను కొనసాగించలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘చిన్నప్పటి నుంచి మాకు రాజకీయాలతో అనుబంధం ఉంది. కానీ, మా కుటుంబ సభ్యుల మధ్య రాజకీయాలకు ఎప్పుడూ చోటివ్వలేదు’’ అని ఆయన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు శనివారం తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఓ వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘రాయ్‌బరేలీ వెళ్లినప్పుడల్లా నేను, ప్రియాంక మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. నాన్నమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నిన్నే జరిగినట్లుగా అనిపిస్తోంది’’ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం గతంలో దేశానికి సైద్దాంతిక రాజకీయ కేంద్రంగా ఉండేదని.. భారతావనికి అది మరోసారి ప్రగతి పథాన్ని చూపాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ అన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ రాయ్‌బరేలీ ముఖ్య భూమిక పోషించిందని పేర్కొన్నారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించాలని కోరారు. ప్రజల భవిష్యత్ మారేది ఓటు ద్వారా మాత్రమేనని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story