ముగ్గురు ‘భారతరత్నా’ల ముచ్చటైన విశేషాలు

by Hajipasha |
ముగ్గురు ‘భారతరత్నా’ల ముచ్చటైన విశేషాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తెలుగు జాతి ముద్దుబిడ్డ.. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.. మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నర్సింహారావుకు మరో అత్యున్నత గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది. పాములపర్తి వెంకట నర్సింహారావుకు భారతరత్న వచ్చిందని తెలియడంతో తెలుగు గడ్డ పులకించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. మన పీవీతో పాటు మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్‌, హరిత విప్లవ యోధుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌‌‌లకు కేంద్ర సర్కారు భారతరత్న అనౌన్స్ చేసింది. సాధారణంగా ఏడాదికి ఒక్కరికే భారత రత్న ప్రకటించే సంప్రదాయం ఉంది. కానీ ఈ ఏడాది సంప్రదాయానికి భిన్నంగా.. రికార్డు స్థాయిలో ఐదుగురిని భారత అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఇటీవలే బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌లకు కూడా కేంద్ర సర్కారు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతరత్నను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి (కర్పూరి ఠాకూర్‌, చౌదరి చరణ్ సింగ్‌, ఎంఎస్ స్వామినాథన్‌‌‌, పీవీ నర్సింహారావు) మరణానంతరం ఈ అత్యున్నత పురస్కారం దక్కింది.

ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసింది పీవీయే : ప్రధాని

పీవీ నర్సింహారావు, చౌదరి చరణ్ సింగ్‌, ఎంఎస్ స్వామినాథన్‌‌‌లకు భారతరత్న ప్రకటించిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడుతూ మూడు వేర్వురు పోస్ట్‌లు చేశారు. చౌదరి చరణ్ సింగ్‌కు తాను నివాళులర్పిస్తున్న ఫొటోను, ఎంఎస్ స్వామినాథన్‌‌‌‌తో తాను దిగిన ఫొటోను, పీవీ నర్సింహారావు ఫొటోను ఈ పోస్టులలో ప్రధాని జతపరిచారు. ‘‘రాజనీతిజ్ఞుడు పీవీ నర్సింహారావు మన దేశానికి అందించిన సేవలు అపారం. ఆంధ్రప్రదేశ్ సీఎంగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసింది. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్‌ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యా రంగంలో ఆయన అందించిన సహకారం.. దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసింది’’ అని మోడీ కొనియాడారు. అన్నదాతల ఆత్మబంధువుగా దేశ వ్యవసాయ రంగానికి మాజీ ప్రధాని చౌదరి చరణ్‌ సింగ్‌ చేసిన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. హరిత భగీరథుడు ఎంఎస్ స్వామినాథన్‌ దేశంలో వ్యవసాయ రంగ విప్లవానికి బాటలు వేసిన తీరును మోడీ మెచ్చుకున్నారు.

ఏకైక తెలుగు ప్రధాని పీవీ..

దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ఏకైక తెలుగు వ్యక్తి, తొలి దక్షిణాది నాయకుడు పీవీ నర్సింహారావే. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్‌ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే. 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకున్న నర్సింహారావు.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి 5లక్షల బంపర్ మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్‌ రికార్డును సృష్టించారు. అంతకుముందు 1957 నుంచి 1977 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పీవీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాష్ట్ర స్థాయిలో పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా సేవలు అందించారు. హోం, రక్షణ, విదేశాంగ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. పీవీ నర్సింహారావు 1921 జూన్‌ 28న వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. కాకతీయ, ఉస్మానియా, ముంబై, నాగ్‌‌పూర్ యూనివర్సిటీల్లో ఆయన చదువుకున్నారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పీవీ 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పీవీకి సంగీతం, సినిమా, నాటకాలంటే ఎంతో ఇష్టం. తెలుగులో సుప్రసిద్ధ నవల ‘వేయిపడగల’ను ఆయన ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించారు.

కరువును చూసి చలించిపోయి..స్వామినాథన్‌ హరిత విప్లవం

తమిళనాడుకు చెందిన ఎంఎస్ స్వామినాథన్‌ .. మన దేశ హరిత విప్లవ పితామహుడు. ఆయన 1943లో బెంగాల్‌ కరువును కళ్లారా చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలన్న లక్ష్యంతో వైద్య రంగం నుంచి తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగులు వేశారు. ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే.. దేశంలో హరిత విప్లవానికి బీజాలు వేసింది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి స్వామినాథన్‌ విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

రైతుబిడ్డ ప్రధాని అయితే.. చౌదరి చరణ్ సింగ్

చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. మొదట కాంగ్రెస్‌‌లో పనిచేసిన ఆయన.. 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా పార్టీని స్థాపించారు. 1980లో లోక్‌దళ్‌ పేరిట మరోసారి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఎమర్జెన్సీ రోజుల్లో చౌదరి చరణ్ సింగ్ జైలు పాలయ్యారు. 1979 జనవరి నుంచి జులై వరకు డిప్యూటీ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1979 జులై 28 నుంచి ఆగస్టు 20 మధ్య 23 రోజుల పాటు ఐదో ప్రధానిగా సేవలు అందించారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. ఈ వ్యవధిలో ఆయన రైతులకు, వ్యవసాయరంగానికి అనుకూలంగా పలు విధాన నిర్ణయాలు తీసుకున్నారు. చౌదరి చరణ్ సింగ్‌కు ఆరుగురు సంతానం. ఆయన కుమారుడు అజిత్‌ సింగ్‌.. రాష్ట్రీయ లోక్‌దళ్‌ వ్యవస్థాపకుడు.

Advertisement

Next Story

Most Viewed