Thane Sex Assault Case: నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు..!

by Shamantha N |   ( Updated:2024-08-20 10:47:29.0  )
Thane Sex Assault Case: నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని థానేలో నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బద్లాపూర్ లోని ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనికి నిరసనగా భారీగా ఆందోళనలు చేపట్టారు. థానే నగరమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు భారీగా నిరసనలు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకారుల నిరసనతో రైళ్లు నిలిచిపోయాయి. బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో ట్రాక్ లపైకి వెళ్లిన ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. అడ్డుకున్న పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అసలేం జరిగిందంటే?

ఆగస్టు 16న బద్లాపుర్‌లోని పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయి. ఇద్దరు చిన్నారులు టాయిలెట్ లో ఉన్న టైంలో.. దాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ వారి దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక ఒకరు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో చిన్నారి స్కూల్ కి వెళ్లాలంటే భయపడింది. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. వారిని నుంచి తొలుత స్పందన రాలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. విచారణ తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు, ఈ దుర్ఘటనపై పాఠశాల యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, ఆయాలను తొలిగించినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఈ చర్యలతో సంతృప్తి చెందలేదు. ఇకపోతే, దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలోని లోపాలు బయటపడ్డాయి. బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని, పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడైంది.

స్పందించిన సీఎం

లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అదికారులను ఆదేశించారు. ఈ కేసును ఫాస్ట్‌రాక్ కోర్టుకు తరలించేందుకు ప్రతిపాదన సమర్పించాలని థానే సీపీని కోరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా స్పందించారు. "బద్లాపూర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశాం. పాఠశాలపై కూడా చర్య తీసుకోబోతున్నాం. ఈ కేసులో వేగవంతంగా దర్యాప్తు జరుపుతున్నాం. దోషులుగా ఎవరు తేలినా వారిని కఠినంగా శిక్షిస్తాం”అని చెప్పారు. ప్రతిపక్షాలు సైతం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed