వ్యక్తులను విచారిస్తే బాల్య వివాహాలు ఆగవు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
వ్యక్తులను విచారిస్తే బాల్య వివాహాలు ఆగవు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బాల్య వివాహాలకు పాల్పడిన వ్యక్తులను విచారించడం వల్ల సామాజిక కోణంలో ఉన్న సమస్య పరిష్కారం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ వేసి పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ‘సొసైటీ ఫర్ ఎన్‌లైట్‌మెంట్ అండ్ వాలంటరీ యాక్షన్’ అనే స్వచ్ఛంద సంస్థ 2017లో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్జీఓ తరఫు లాయర్, కేంద్ర తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపించారు. అనంతరం ఇదొక సామాజిక సమస్య అని బెంచ్ అభిప్రాయపడింది. ప్రభుత్వ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుందో తెలపాలని ఆదేశించింది. అలాగే సమస్యను పరిష్కరించడానికి ముందుకు సాగే మార్గంపై సూచనలు ఇవ్వాలని ఇరుపక్షాలను కోరింది. అంతకుముందు అదనపు సొలిసిటర్ జనరల్ ప్రస్తుత స్థితి గురించి ధర్మాసనానికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అసోం వంటి రాష్ట్రాల్లో బాల్య వివాహాల కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో ఈ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు బెంచ్ తెలిపింది.

Advertisement

Next Story