దర్యాప్తు సంస్థలు ఎవరికైనా సమన్లు ఇవ్వొచ్చు : సుప్రీంకోర్టు

by Hajipasha |
దర్యాప్తు సంస్థలు ఎవరికైనా సమన్లు ఇవ్వొచ్చు : సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : కేసుల దర్యాప్తులో భాగంగా వాటితో ముడిపడిన ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్ 50 వాటికి ఆ అధికారాన్ని కల్పిస్తుందని పేర్కొంది. తమిళనాడులో అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో జరిగిన మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఐదుగురు జిల్లా కలెక్టర్లకు సమన్లు జారీ చేయగా వారు గత ఆరు నెలలుగా విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈడీకి విచారణలో సహకరించాలని ఫిబ్రవరి 27న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఆ అధికారులు దాటవేశారు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. ఆ కలెక్టర్లకు రాజ్యాంగమన్నా, కోర్టు ఆదేశాలన్నా లెక్క లేకుండాపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరి అవకాశం ఇస్తున్నామని.. ఏప్రిల్ 25న ఆ ఐదుగురు కలెక్టర్లు వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.

కపిల్ సిబల్ వాదన ఇలా..

తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీ వాదనలు వినిపించారు. ఎన్నికల ఏర్పాట్లతో పాటు శాంతిభద్రతలు, సామాజిక భద్రతా పథకాల అమలులో బిజీగా ఉన్నందు వల్లే సదరు జిల్లా కలెక్టర్లు ఈడీ విచారణకు హాజరుకాలేదని వారు కోర్టుకు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో సాక్ష్యులుగా పిలుస్తున్నారా ? నిందితులుగా పిలుస్తున్నారా ? అనే దానిపై కూడా కలెక్టర్లకు ఈడీ అధికారులు క్లారిటీ ఇవ్వలేదని కపిల్ సిబల్ చెప్పారు. ఆ కలెక్టర్ల పరిధిలో లేని అంశాలపై ఈడీ సమాచారం అడగడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి సాకులన్నీ చెల్లవని, దర్యాప్తు సంస్థలు విచారణకు పిలిస్తే వెళ్లి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేసులతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.

Advertisement

Next Story