నానమ్మ నుంచి మా నాన్నకు వారసత్వంగా సంక్రమించింది వీరమరణమే : ప్రియాంక

by Hajipasha |   ( Updated:2024-05-02 18:45:23.0  )
నానమ్మ నుంచి మా నాన్నకు వారసత్వంగా సంక్రమించింది  వీరమరణమే : ప్రియాంక
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇందిరాగాంధీ నుంచి సంక్రమించే వారసత్వ సంపదపై పన్నుభారం పడకూడదనే ఉద్దేశంతోనే వారసత్వపు పన్నును రాజీవ్‌గాంధీ రద్దు చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ప్రియాంకాగాంధీ ఎమోషనల్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నానమ్మ (ఇందిరాగాంధీ) నుంచి మా నాన్నకు(రాజీవ్‌గాంధీ) వారసత్వంగా లభించింది సంపద కాదు. వీరమరణం’’ అని ఆమె ఉద్వేగానికి గురవుతూ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకాాగాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా వారం క్రితం ఇదే మొరెనా పట్టణం వేదికగా జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీపై మోడీ విమర్శలు చేయడం గమనార్హం. ‘‘ప్రధాని మోడీకి గో సంరక్షణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే పశువులను ఒక చోట చేర్చి గోశాలగా ఏర్పాటు చేయాలి’’ అని ప్రియాంకాగాంధీ సవాల్ విసిరారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో బయటతిరిగే పశువులను సేకరించి గోశాలలను పెద్ద సంఖ్యలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. వాటి వల్ల మహిళలకు మంచి ఆదాయం లభించింది. స్వయంగా ప్రభుత్వమే ఆయా గోశాలల నుంచి ఆవు పేడను కొనుగోలు చేేసేది’’ అని ఆమె చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed