కాంగ్రెస్ ఇలాకలో పావులు కదుపుతున్న మోడీ, కేజ్రీవాల్!

by GSrikanth |   ( Updated:2023-01-28 13:57:55.0  )
కాంగ్రెస్ ఇలాకలో పావులు కదుపుతున్న మోడీ, కేజ్రీవాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. త్రిపుర, మిజోరం, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌పై ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఫోకస్ పట్టాయి. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి గతంలో కోల్పోయిన అధికారాన్ని ఈసారి చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే సీన్‌లోకి ఎంటరై పంజాబ్ తరహా ఫలితాన్ని సాధించాలనే పట్టుదలతో కేజ్రీవాల్ పార్టీ పావులు కదుపుతోంది. దీంతో రాజస్థాన్ దంగల్‌లో గెలుపెవరిది అనేది ఇప్పటి నుంచే చర్చగా మారుతోంది.

మోడీ ఫోకస్:

ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే బీజేపీ ఎడారి రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ప్రధాని మోడీ రాజస్థాన్ లో పర్యటించడం ఆసక్తిగా మారింది. బిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ 1111 అవతరణ్ వేడుకలకు మోడీ హాజరయ్యారు. అయితే గుజ్జర్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే బిల్వారాలో మోడీ పర్యటించడం, తాను ఇక్కడికి ప్రధానిగా రాలేదని సామాన్య భక్తుడిగా వచ్చానని చెప్పడంతో ఈ టూర్ సెంటిమెంట్ వైజ్‌గా ఆసక్తిని రేపింది. అయితే 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో తాము పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఇక్కడ పూర్తి బలంతో పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించడంతో ఈ పరిణామం కాంగ్రెస్ కు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. సరిగ్గా ఎడాది క్రితం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మతిరిగేలా చేసింది. బీజేపీని కాదని అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గద్దెదించి అందరిని ఆశ్చర్యపరిచింది. దాంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై చర్చ మొదలైంది. ఆ దెబ్బతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్ కు 'కొంచెం ఇష్టం కొంచం కష్టం'లా ఫలితాలు వచ్చాయి. గుజరాత్ లో ఐదు సీట్లను గెలుచుకుని 13 శాతం ఓట్లు పోలరైజ్ చేసుకోగా హిమాచల్ ప్రదేశ్ లో జీరో స్థానాలకే పరిమితం అయింది. దాంతో పంజాబ్ విజయంతో జోరు మీదున్న కేజ్రీవాల్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ రియల్ గ్రాఫ్ చూపించిందనే విమర్శలు వినిపించాయి. పూర్తి ఫలితాలు ఎలా ఉన్నా గుజరాత్ లో సాధించిన ఓట్లతో ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా కట్టబెట్టింది.

రాజస్థాన్ కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం:

మరో 11 నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ సీఎం అశోక్ గెహ్లాట్ కు సచిన్ పైలట్ కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో చీలక వస్తుందనే పరిస్థితులు బహిరంగ రహస్యంగా మారిపోయాయి. పంజాబ్ లోనూ ఇలాంటి పరిస్థితే ఆమ్ ఆద్మీకి కలిసి వచ్చేలా చేసిందనే టాక్ ఉంది. అక్కడ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పీసీసీ నవజ్యోత్ సింగ్ సిద్ధుకు మధ్య వైరం ఆ తర్వాత పార్టీని సంక్షోభం దిశగా నడిపించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ప్రజలు అనూహ్యంగా ఆమ్ ఆద్మీకి అధికారం కట్టబెట్టారని రాజస్థాన్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందనే ధీమా కేజ్రీవాల్ పార్టీలో వ్యక్తం అవుతోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజస్థాన్ లో పోటీకి సిద్ధం అయితే అది కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే చర్చ జరుగుతోంది. గుజరాత్ లో ఎప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పోటీ ఉండేది. అనూహ్యంగా ఆప్ రావడంతో ముక్కోణ పోరుగా మారింది. అయితే ఇక్కడ కేజ్రీవాల్ పార్టీ ప్రధానంగా బీజేపీ వ్యతిరేక ఓటునే చీల్చింది. అంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే తమ వైపు తిప్పుకోగలిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఆమ్ ఆద్మీ బీజేపీకి అనుకోని వరంగా పరిణమించడం వల్లే కమలం పార్టీ గుజరాత్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 స్థానాలను దాటగలిగిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి రాజస్థాన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎఫెక్ట్ ఎవరిపై ఉండబోతోందనేది ఆసక్తికర చర్చగా మారింది.

Advertisement

Next Story

Most Viewed