President's Rule: జమ్ముకశ్మీర్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం

by Shamantha N |   ( Updated:2024-10-14 07:14:41.0  )
Presidents Rule: జమ్ముకశ్మీర్ లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. రాష్ట్రపతి పాలన (President’s Rule)ను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఈ ఉత్తర్వు వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. "జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని సెక్షన్ 73 ద్వారా వచ్చిన అధికారాలను అమలు చేస్తూ కేంద్రపాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అమలవుతోంది. కాగా.. అదే చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం ముఖ్యమంత్రి నియామకానికి ముందు 31 అక్టోబర్ 2019 నాటి ఉత్తర్వు వెంటనే రద్దవుతోంది” అని రాష్ట్రపతి సంతకం చేసిన గెజిట్ లో ఉంది. దీంతో, దాదాపు ఆరేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు అయ్యింది. ఇకపోతే, అక్కడ దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్‌సీ-కాంగ్రెస్‌ కూటమి విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

2019 నుంచి రాష్ట్రపతి పాలన

కాగా, జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. పీడీపీకి బీజేపీ మద్దతుని ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. దీంతో శాసన సభను రద్దు చేసి, ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. అది కూడా ముగియడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది. 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. అలానే ఆ ప్రాంతాన్ని.. జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ పరిణామాలతో, 2019లో అక్కడ జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. భద్రతాకారణాల వల్ల ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహంచేందుకు భయపడింది. దీంతో 2019 అక్టోబర్ 31న రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాన్ని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, 90 స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీలో ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమికి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించింది. కాగా.. జమ్ముకశ్మీర్ కూటమి నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆయనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Next Story

Most Viewed