ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?.. కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్ !

by Swamyn |
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన?.. కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పదవి నుంచి తొలగించాలనే యోచనలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. కేజ్రీవాల్‌ను తొలగించి రాష్ట్రపతి పాలన విధించాలన్న వ్యూహంతో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆప్ నేతలు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. అయితే, అంతకన్నా ముందే కేజ్రీవాలే సీఎం పదవి నుంచి తప్పుకోనున్నారని, ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ లేదా మంత్రి అతిషిని సీఎంగా చేయాలనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. తాజా పరిణామాలు సైతం ఇందుకు తగ్గట్టుగానే జరుగుతుండటం గమనార్హం.

కోర్టు తీర్పు అనంతరం సక్సేనా ఎంట్రీ

సీఎం పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. సీఎం జైలుకు వెళ్లడంతో ఢిల్లీలో పాలన గాడి తప్పిందంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయగా, అలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టయిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనేది పూర్తిగా కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ అంశంపై రాష్ట్రపతి లేదా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ)‌ను సంప్రదించాలని సూచించింది. ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు నుంచే ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఆప్ సర్కార్‌పై విమర్శలకు దిగారు. దేశ రాజధానిలో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్లపై ఉందంటూ మండిపడ్డారు. ఢిల్లీ హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఆస్పత్రులలో కాటన్ కూడా లేదని ఆరోపించారు. అంతకుముందు, ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు ఇవ్వడాన్నీ సక్సేనా తప్పుబట్టారు. ఈ విధంగా ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆప్ పాలన గాడితప్పుతుందనే భావన కలిగించాలని బీజేపీ చూస్తోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.

‘ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర’

ఢిల్లీలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనుందని పలువురు ఆప్ నేతలు సైతం చెబుతూ వస్తున్నారు. దీనిపై తాజాగా మంత్రి అతిషి స్పందిస్తూ, ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలనను తీసుకురావడానికి బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారని, సీఎం ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పిన ఆమె.. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలు, పోస్టింగ్‌లు సైతం ఆపేశారని విమర్శించారు. పైగా, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు కొంతకాలంగా ఎల్జీ నిరాధారమైన లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ఢిల్లీ ప్రభుత్వం గాడితప్పినట్టు రాష్ట్ర ప్రజల్లో ముద్రవేసి, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలనే వ్యూహంతో బీజేపీ ఉందని ఆరోపించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ తొలగించిన నేపథ్యంలో అతిషి ఈ వ్యాఖ్యలు చేశారు.

మరికొన్ని రోజులు జైల్లోనే..!

తమ అధినేత కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు మొదట్లో చెప్పినా.. క్రమంగా స్వరం మారుస్తూ వస్తున్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ రిమాండ్ గడువు ఈ నెల 15న ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, ఈలోపే కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లిక్కర్ స్కాం కేసులోనే అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కవిత ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం.. సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే జరగనుందని ఆప్ నేతలు భావిస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ మరికొంతకాలం జైల్లోనే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బీజేపీకి అవకాశం ఇవ్వకుండా, తనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

సునీతా కేజ్రీవాలే ఉత్తమం: ఆప్ నేత

కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా తప్పుకుంటే గనుక ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకోసం ప్రస్తుతానికి ఇద్దరు పోటీలో ఉన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, తర్వాతి స్థానంలో పార్టీ కీలక నేత, మంత్రి అతిషి ఉన్నారు. అయితే, ఎక్కువ అవకాశాలు మాత్రం సునీతా కేజ్రీవాల్‌కే ఉన్నాయి. పార్టీ నేతలు సైతం ఆమెకే మద్దతుగా ఉన్నారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పటీ నుంచి ఆయన పంపే సందేశాలను ప్రజలకు చేరవేస్తూ వస్తున్నారు. దీంతో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దీనిపై ఆప్ నేత, కేబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్న తరుణంలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడటానికి, నాయకులను కలిపి ఉంచడానికి సునీతా కేజ్రీవాల్ ఉత్తమమైన వ్యక్తి అని తాజాగా వెల్లడించారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, సునీతా కేజ్రీవాల్, ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ సీఎం దూత అని, ఆయన సందేశాలను ఆమె ప్రజలకు చేరవేస్తున్నారని చెప్పారు. ఇది తమ పార్టీ క్యాడర్‌పై, మద్దతుదారులపై సానుకూల ప్రభావం చూపుతోందని తెలిపారు.

Advertisement

Next Story