యూసీసీకి రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంలో ఏముంది ?

by Hajipasha |   ( Updated:2024-03-13 13:49:48.0  )
యూసీసీకి రాష్ట్రపతి ఆమోదం.. ఈ చట్టంలో ఏముంది ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఆమోదించిన యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌(యూసీసీ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోదముద్ర వేశారు. దీంతో ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లు చట్టంగా మారింది. వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు వంటి పర్సనల్‌ చట్టాలన్నింటినీ ఒకే గొడుగుకు కిందకు తీసుకొచ్చి ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్‌ కోడ్‌‌ను రూపొందించింది. తాజాగా ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో.. యూసీసీని అమల్లోకి తెచ్చిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ అవతరించింది.

యూసీసీ రూల్స్..

యూసీసీ ప్రకారం సహజీవనం సాగించడాన్ని కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. వివాహాల రిజిస్ట్రేషన్ అన్ని మతాల వారికి తప్పనిసరి. రిజిస్ట్రేషన్ జరగని వివాహం చెల్లదు. ఏడాది తర్వాత మాత్రమే విడాకుల పిటిషన్లను అనుమతిస్తారు. విడాకులకు సబంధించి యూనిఫాం విధానం అమల్లోకి వస్తుంది. బాల్య వివాహాలపై సంపూర్ణ నిషేధం ఉంటుంది. యువతుల వివాహ వయోపరిమితి 18 ఏళ్లుగా, యువకుల వివాహ వయోపరిమితి 21 ఏళ్లుగా నిర్ధారించారు. భర్త అత్యాచారం చేసినా, అసహజ శృంగారానికి పాల్పడాలని ఒత్తిడి తెచ్చినా, ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నా విడాకులు ఇచ్చే హక్కును భార్యకు ఈ చట్టం కల్పించింది. బహుభార్యత్వంతో పాటు హలాలా సంప్రదాయాన్నీ ఈ చట్టం నిషేధించింది. ఉత్తరాఖండ్ యూసీసీ నుంచి గిరిజన వర్గాలను మినహాయించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూసీసీ అమలుపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈవిషయంలో గుజరాత్, అసోం ముందంజలో ఉన్నాయి. ప్రత్యేకించి అసోం ప్ర‌భుత్వం రూపొందించిన యూసీసీ ముసాయిదా బిల్లు దుమారం రేపేలా ఉంది.

Advertisement

Next Story