Chandrayaan-3: చంద్రుడిపై ‘సల్ఫర్‌’..

by Vinod kumar |
Chandrayaan-3: చంద్రుడిపై ‘సల్ఫర్‌’..
X

బెంగళూరు: జాబిల్లి రహస్యాలను చంద్రయాన్-3 మిషన్ క్రమంగా ఛేదిస్తోంది. చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధ్రువంలో దిగిన ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటికే ఉపరితలంపై, లోతుకు వెళ్తున్న కొద్దీ మారుతున్న ఉష్ణోగ్రతల వైవిధ్యాన్ని గుర్తించింది. ఇప్పుడు అక్కడ ఖనిజాల వేటలో పడింది. వారం రోజుల శోధనలో చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ ఉనికిని గుర్తించింది. ‘రోవర్‌లోని లేజర్ ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (లిబ్స్) పరికరం దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న చంద్రుని ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని నిస్సందేహంగా నిర్ధారిస్తోంది. ప్రస్తుతం హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది’ అని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం ఎక్స్ (ట్విటర్)లో తెలిపింది.

అల్యూమినియం, క్యాల్షియం, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్, ఆక్సిజన్‌లను కూడా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని పేర్కొన్నది. లిబ్స్ అనేది ఒక శాస్త్రీయ సాంకేతికత. ఇది ఖనిజాలను తీవ్రమైన లేజర్ పల్స్‌తో పరీక్షించి వాటి కూర్పును కొలుస్తుంది. చంద్రుడి ఉపరితలంలో లోతుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతోంది. చంద్రుని ధూళి, కంకర యొక్క రసాయన కూర్పును పరిశోధించడం రోవర్ యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి. ఈ పరిశోధన చంద్రుని భూగర్భ శాస్త్రం, వాతావరణం గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది. భూమి యొక్క ఖగోళ సమాచారంపై అవగాహనకు దోహదం చేస్తుంది.

Advertisement

Next Story