డీకే శివకుమార్‌కు ఈసీ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

by Harish |   ( Updated:2024-04-22 11:42:04.0  )
డీకే శివకుమార్‌కు ఈసీ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌కు ఈసీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదు చేశారు. తన సోదరుడు డీకే సురేష్‌కు ఓటు వేస్తే కావేరి నది నుండి నీటిని సరఫరా చేస్తానని బెంగళూరు ఓటర్లకు చెప్పినట్లుగా ఇటీవల ఒక వీడియో బయటకు రాగా, దానికి సంబంధించి కోడ్‌ను ఉల్లఘించారని ఈసీ కేసు నమోదు చేసింది. శివకుమార్‌ సోదరుడు బెంగళూర్ రూరల్ లోక్‌సభ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా, తన సోదరుడిని గెలిపిస్తే, కావేరి నదిని ఇక్కడికి తీసుకొస్తామని డీకే శివకుమార్‌ హామీ ఇచ్చారు.

ఈ విధమైన ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓట్ల కోసం ప్రజలను ప్రలోభం పెట్టారని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ప్రసంగం ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించిందని, పోలీసు కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేకపోవడంతో నది జలాల, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీళ్ల కొరతతో ప్రభుత్వం నీటి వినియోగంపై ఆంక్షలు విధించింది. బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా, ప్రస్తుతం అవసరమైన దానిలో సగం మాత్రమే అందుతుంది.

Advertisement

Next Story