ఢిల్లీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్‌లో మరో నలుగురి అరెస్ట్

by Harish |
ఢిల్లీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్‌లో మరో నలుగురి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల సంచలనం సృష్టించిన ఢిల్లీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్‌లో శుక్రవారం పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం అరెస్టుల సంఖ్య 12కు చేరింది. నలుగురు నిందితులు రోహిత్, జితేంద్ర, మాజిద్, సాజిద్‌లు అందరూ ఆంకాలజీ విభాగాలలో పనిచేస్తున్నారు, వారు ఈ రాకెట్‌ వెనుక సూత్రధారులలో ఒకరైన నీరజ్ చౌహాన్‌కు సహకరించారని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితం ఈ నకిలీ మందుల రాకెట్‌ను ఛేదించారు. నిందితులు రూ.100 విలువ చేసే యాంటీ ఫంగల్ మందులను ఖాళీ సీసాల్లో నింపి ప్రాణాలను కాపాడే క్యాన్సర్ ఔషధంగా పేర్కొంటూ భారత్, అమెరికా, చైనాలో ఒక్క సీసాను రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తుండేవారు. రెండేళ్లకు పైగా సాగుతున్న ఈ రాకెట్‌లో నిందితులు దాదాపు 7 వేలకు పైగా ఇంజెక్షన్లను విక్రయించినట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా ఈ నకిలీ మందులను ఢిల్లీ, గురుగ్రామ్‌లోని రెండు ఫ్లాట్లలో తయారు చేసినట్లు గుర్తించారు. ఈ రాకెట్‌లో ప్రధాన సూత్రధారులు విఫిల్ జైన్, నీరజ్ చౌహాన్‌తో పాటు మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో నలుగురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విక్రయించిన నకిలీ మందుల విలువ రూ. 25 కోట్లకు పైగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed