అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్

by Harish |
అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 11 మంది బంగ్లాదేశ్ పౌరులను త్రిపుర రాజధాని అగర్తల రైల్వేస్టేష‌న్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది బంగ్లాదేశీయులు త్రిపురలోని సెపాహిజాలా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దును దాటి అగర్తల రైల్వేస్టేష‌న్‌లో రైలు ఎక్కారని రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వారి కోసం జూన్ 29 సాయంత్రం నుండి వెతకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనుమానస్పదంగా ఉన్న బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి, విచారించగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ఎటువంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించలేకపోయారని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఆ 11 మందిని అరెస్టు చేశారు. వారిని తదుపరి విచారణ కోసం పోలీసు రిమాండ్ కోరుతూ కోర్టు ముందు హాజరుపరచనున్నామని ఇన్‌ఛార్జ్ అధికారి (ఓసి) తపస్ దాస్ తెలిపారు. 11 మందిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కూడా జీవనోపాధి కోసం చెన్నై, ముంబై, కోల్‌కతాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు. అయితే మానవ అక్రమ రవాణా ప్రయత్నాలను కూడా తోసిపుచ్చలేము, ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. అంతకుముందు జూన్ 27న భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఇద్దరు బంగ్లాదేశీ పౌరులను అగర్తల రైల్వే స్టేషన్ నుండి అరెస్టు చేశారు.

Advertisement

Next Story