దేశంలో దారుణాలు జరిగితే ప్రధాని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: దీదీ

by S Gopi |   ( Updated:2024-04-05 14:24:22.0  )
దేశంలో దారుణాలు జరిగితే ప్రధాని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు: దీదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ప్రధాని మోడీ రాష్ట్రంలోని సందేశ్‌ఖాలీ అంశంపై విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన దీదీ.. దేశవ్యాప్తంగా మహిళలు, ముస్లింలు, దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్నా సరే ప్రధాని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని ఆరోపించారు. సందేశ్‌ఖాలీ అంశంపై ప్రధాని మోడీ ఇటీవల, నిందితులను రక్షించేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు చేశారు. అయితే, సందేశ్‌ఖాలి సమస్యపై తృణమూల్ కాంగ్రెస్ సరైన పద్దతిలోనే వ్యవహరించిందని దీదీ పేర్కొన్నారు. దేశానికి పతకం సాధించిన క్రీడాకారిని సాక్షి మాలిక్‌పై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మోడీని ప్రశ్నించారు. అతన్ని రాజకీయ నాయకుడిగా మార్చారు, అతనిపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని మమతా బెనర్జీ అన్నారు. 'మోడీ బాబు.. బిల్కిస్ హత్య జరిగినప్పుడు మీరు నిద్రపోతున్నారా? హత్రాలో ముస్లింలు, దళితులు అవమానాలకు గురైనప్పుడు కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారా? ఎన్ఆర్‌సీ సమయంలో అస్సాంలో ప్రజలు హత్యగావించబడినప్పుడు ఎక్కడ నిద్రపోతున్నారని' దీదీ విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story