నలంద వర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

by S Gopi |
నలంద వర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. వర్సిటీ గత చరిత్రను ప్రశంసించిన ప్రధాన మంత్రి, నలంద విశ్వవిద్యాలయం భారత గుర్తింపు, గౌరవం, విలువ, మంత్రాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. భారత్‌ను ప్రపంచ విద్య, విజ్ఞాన కేంద్రంగా మార్చడం తన లక్ష్యం. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే నలంద యూనివర్శిటీని సందర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నలంద అంటే కేవలం పేరు కాదు, అది ఒక గుర్తింపు, గౌరవం. నలంద ఒక విలువ, మంత్రం. అగ్ని పుస్తకాలను కాల్చగలదు, కానీ జ్ఞానాన్ని నాశనం చేయదు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశానికి స్వర్ణయుగం ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. దేశ గుర్తింపును ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఎదగడమే తన లక్ష్యం. ఈ యూనివర్సిటీ భారత చరిత్రకే పరిమితం కాదని, ఆసియా మొత్తంలో భాగమని అన్నారు. యూనివర్శిటీ పునర్నిర్మాణంలో మన తోటి దేశాలు కూడా పాలుపంచుకున్నాయని తెలిపారు. నలంద కొత్త క్యాంపస్ దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఉదాహరణగా నిలుస్తుంది. బలమైన మానవ విలువలపై ఆధారపడిన దేశాలకు గతాన్ని ఎలా పునరుద్ధరించాలో, మంచి భవిష్యత్తుకు పునాది ఎలా వేయాలో చూపుతుంది.

అంతకుముందు ప్రధాని మోడీ బీహార్‌లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం శిథిలాలను సందర్శించారు. ఈ శిథిలాలు 2016లో ఐక్యరాజ్యసమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ రాజేంద్ర వీ ఆర్లేకర్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, భారత విదేశాంగ మంత్రి ఎన్ జై శంకర్ పాల్గొన్నారు.

మోడీ వేలు చెక్ చేసిన నితీష్..

నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ ప్రారంభం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోడీ చేతి వేళ్లను పరిశీలించారు. అనూహ్యంగా నితీశ్ తన చేతిని పట్టుకోవడంతో మోడీ షాక్ అయ్యారు. తక్షణం వెనుక ఉన్న ప్రధాని భద్రతా సిబ్బంది సైతం అప్రమత్తం అయ్యారు. అయితే, నితీష్ మోడీ చేతి వేలిను పరిశీలించి, ఏమిటని అడిగారు. ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు వేసిన ఇంక్ అని మోడీ చెప్పారు. వీరిద్ధరి మధ్య జరిగిన ఈ చిన్న సంభాషణ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed