పథకాల కోసం ప్రజల ఎదురుచూపులు.. ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

by Shiva |
పథకాల కోసం ప్రజల ఎదురుచూపులు.. ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
X

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలవుతోంది. ఇప్పటిదాకా పెద్దగా ఆర్థిక భారం పడని హామీలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. కీలకమైన పేదల గృహ నిర్మాణం, తల్లికి వందనం, మహాశక్తి పథకాల కోసం జనం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితులు ఇంకా గాడిలో పడలేదు. ఇవన్నీ ఇబ్బడిముబ్బడిగా నిధులుంటే తప్ప అమలు సాధ్యం కాదు. అయినా సీఎం చంద్రబాబు ఏమాత్రం సంకోచించడం లేదు. దశలవారీగా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి రథ సారధి ఆలోచిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: గత వైసీపీ సర్కారు పేదల గృహ నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నట్లు నాడు ప్రకటించింది. సుమారు 26 లక్షల మంది పేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చింది. దాదాపు 5 లక్షల ఇళ్లు నిర్మించింది. అప్పట్లో పేదల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ టీడీపీతోపాటు విపక్షాలు విమర్శలు సంధించాయి. రూరల్‌లో మూడు సెంట్లు, అర్బన్‌లో రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీనిచ్చింది. గృహ నిర్మాణానికి ఇచ్చే సాయాన్ని రూ.4.50 లక్షలకు పెంచుతామని వెల్లడించింది. వీటి ఆచరణకు ఇంకా అడుగు పడలేదు. అంతకముందు టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు సుమారు 3 లక్షలున్నాయి. వాటిల్లో పది శాతం కూడా లబ్ధిదారులకు అందలేదు. కొద్దిపాటి పనులు చేపడితే అవికూడా పూర్తవుతాయి. కూటమి సర్కారు ఏం చేస్తుంది.. ఎప్పుడు ఈ హామీని అమలు చేస్తుందనే దానిపైనే పేదలు గంపెడాశలు పెట్టుకున్నారు.

‘మహాశక్తి’ పథకంపైనే నిరీక్షణ

టీడీపీ ఇచ్చిన హామీల్లో మహిళల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి మహాశక్తి పథకం కీలకమైంది. వైసీపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు కాపు మహిళలకు సైతం ఏటా రూ.15 వేల నుంచి రూ.18,500 సాయం అందించింది. టీడీపీ మాత్రం మహాశక్తి పథకం కింద ప్రతినెలా 18–60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు ప్రతినెలా రూ.1500 అందిస్తామని హామీనిచ్చింది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే దండిగా డబ్బులుండాలి. ఇదేగాక తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఇస్తామన్న హామీ కూడా చాలా కీలకం. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీ వైపు మహిళలను ఆకర్షించడానికి ఈ హామీలు కీలకంగా పనిచేశాయి. ఈ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఎదురు చూస్తున్నారు. నిధులు సర్దుబాటయ్యే దాకా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలాంటి వాటిని కూటమి సర్కారు ముందుకు తెచ్చినట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

‘నిరుద్యోగ భృతి’ అమలయ్యేనా?

ఇవిగాక ఇంకా నిరుద్యోగ భృతి కూడా కీలకమైన హామీ. గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఇప్పుడిప్పుడే సరిచేస్తున్నామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. నిధుల సర్దుబాటును బట్టి ఒక్కో పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో విజ్ఞత ప్రదర్శించిన ప్రజలు తప్పకుండా అర్థం చేసుకుంటారని ఆయన భావిస్తున్నారు. రాజధాని, పోలవరం నిర్మాణాలపై దృష్టి సారిస్తూనే మరోవైపు పీ–4 పద్ధతిలో పరిశ్రమల స్థాపనపై దృష్టి సారిస్తున్నారు. కొంతమేర ఉపాధి అవకాశాలు పెంచిన తర్వాత నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలనుకుంటున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed