‘ఉక్రెయిన్’ సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలి: పుతిన్‌కు మోదీ సూచన

by Mahesh Kanagandla |
‘ఉక్రెయిన్’ సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించుకోవాలి: పుతిన్‌కు మోదీ సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా వివాదానికి ముగింపు పలకాలని, సమస్యకు శాంతియుత మార్గంలో పరిష్కారాలు అన్వేషించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. ఈ ఘర్షణ మొదలైనప్పటి నుంచి తాము రష్యాతో టచ్‌లో ఉన్నామని, ఎప్పటికప్పుడు శాంతి గురించి, దౌత్య మార్గంలో సంప్రదింపులు గురించి గుర్తు చేస్తూనే ఉన్నామని వివరించారు. భారత్ శాంతిమార్గాన్నే విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపడానికి భారత్ అన్ని విధాల సహకరించడానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఏ పాత్ర పోషించడానికైనా రెడీ అని వివరించారు. మానవాళి సంక్షేమం తమ తొలి ప్రాధాన్యత అని, భవిష్యత్‌లోనూ సాధ్యమైన సహాయం అందించడానికి సిద్ధమని వివరించారు. రష్యా అధ్యక్షతన ఈ నెల 23, 24వ తేదీల్లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు కోసం నరేంద్ర మోదీ ఆ దేశంలోని కజాన్ నగరానికి వెళ్లారు. మోదీకి రష్యాలో ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులను కలిశారు.

మూడు నెలల్లో రెండు పర్యటనలు:

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జులైలో రష్యాలో నిర్వహించిన ఉభయ దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశాలను ప్రస్తావించారు. ‘గత మూడు నెలల్లోనే నేను రెండు సార్లు రష్యా పర్యటించడం.. మన దేశాల మధ్య ఉన్న సమన్వయం, సత్సంబంధాలు, మైత్రిని వెల్లడిస్తున్నది. జులైలో మాస్కోలో జరిగిన శిఖరాగ్రత సమావేశాల్లో ఉభయ దేశాల మధ్య ప్రతి రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకున్నాం. 15 ఏళ్లలో బ్రిక్స్ కూటమి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు అనేక దేశాలు ఈ కూటమిలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ సారి కూటమి సదస్సుకు రష్యా అధ్యక్షత వహించడం సంతోషకరం’ ప్రధాని మోదీ వివరించారు.

కజాన్‌లో కొత్త కాన్సులేట్:

కజాన్‌లో భారత కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కజాన్ నగరంతో భారత్ లోతైన చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నదని ప్రధాని తెలిపారు.

ఢిల్లీని గౌరవిస్తాం:

ఈ సమావేశంలో భారత్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. బ్రిక్స్ కూటమిలో ఈ రెండు వ్యవస్థాపక సభ్య దేశాలని, భారత్-రష్యాల సహకారానికి తాము ఉన్నత విలువనిస్తామని వివరించారు. ఉభయ దేశాల శాసన సభ్యులు, విదేశాంగ మంత్రులు నిత్యం టచ్‌లో ఉండటం, వాణిజ్యం సానుకూల వృద్ధి సాధించడం ఈ రెండు దేశాల సంబంధాలు వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయని తెలిపారు. భారత స్నేహాన్ని తాము ఎక్కువ గౌరవిస్తామని పేర్కొన్నారు.

పుతిన్ ఫన్:

ఈ సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ ఓ ఛలోక్తి విసిరారు. తాను మాట్లాడుతుండగా.. ప్రధాని మోదీని చూస్తూ తమ దేశాల మధ్య లోతైన, పటిష్టమైన సంబంధాలు ఉన్నాయని వివరించారు. కాబట్టి, తాను మాట్లాడే విషయాలను అనువాదం చేయాల్సిన పని లేదని, ట్రాన్స్‌లేషన్ లేకున్నా అర్థమైపోతాయన్నారు. ఈ వ్యాఖ్యలతో సమావేశంలో నవ్వులు విరిశాయి.

నేడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ

కజాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ బుధవారం సమావేశం కానున్నారు. ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ తొలిసారి భేటీ కానున్నారు. ఈ భేటీని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ధ్రువీకరించారు. మంగళవారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌తో మోదీ సమావేశమయ్యారు.

Advertisement

Next Story