40 సీట్లు.. యువరాజు.. రాష్ట్రాలకు నిధులు.. ప్రధాని ప్రసంగపు ముఖ్యాంశాలివీ

by Hajipasha |
40 సీట్లు.. యువరాజు.. రాష్ట్రాలకు నిధులు.. ప్రధాని ప్రసంగపు ముఖ్యాంశాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40కి మించి లోక్‌సభ సీట్లను గెలవలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోస్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన విధంగా హస్తం పార్టీకి కనీసం 40 సీట్లయినా రావాలని తాను కూడా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బుధవారం రాజ్యసభలో ప్రసంగిస్తూ ప్రధాని మోడీ మరోసారి కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ను పుట్టించిందే బ్రిటీష్ వ్యక్తి. కాంగ్రెస్ బానిస మనస్తత్వం వల్ల స్వాతంత్య్రం అనంతరం దేశం వెనకబడి పోయింది. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారు. మేం గత పదేళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాం’’ అని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఖర్గేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభలో ఖర్గే సుదీర్ఘంగా మాట్లాడినందుకు సంతోషిస్తున్నాను. ఆయన కమాండర్లు ఇద్దరు సభలో లేకపోవడం వల్లే స్వేచ్ఛగా మాట్లాడగలిగారు’’ అని ప్రధాని చెప్పారు. ‘‘ఖర్గే వల్ల రాజ్యసభలో కొంత వినోదం లభిస్తోంది’’ అని సెటైర్ వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్టప్‌గా ప్రజెంట్ చేసింది. కానీ యువరాజు నాన్ స్టార్టప్ అని తేలింది’’ అని సెటైర్స్ వేశారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా యువరాజును లాంచ్ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు.

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు సమానమే

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీపైనా ప్రధాని మోడీ స్పందించారు. ‘‘నా దేశం అంటే ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు. బెంగళూర్, హైదరాబాద్, చెన్నై అంతా నాదే. ఇండియా అంటే ఒక్క ఢిల్లీ మాత్రమే కాదని జీ20 నేతలకు చాటి చెప్పాం. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాలు ఒక అడుగు ముందుకేస్తే, దేశం రెండు అడుగులు ముందుకు వేస్తుంది. ఒక రాష్ట్రంలో సంక్షోభం వస్తే దాని ప్రభావం యావత్ దేశంపై ఉంటుంది. కరోనా మహమ్మారి ఎదుట ప్రపంచం ఓడినా భారత్ గెలిచింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి. నిధులు కేటాయింపును సంకుచితంగా చూడకూడదు. రాష్ట్రాలపై వివక్ష లేదు. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం. మా రాష్ట్రం, మా టాక్స్ అని అంటున్నారు. ఇదెక్కడి వితండవాదం..?’’ అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. ‘‘నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది.. నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా..? మా రాష్ట్రంలోనే బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే కుదురుతుందా..?’’ అని ప్రధానమంత్రి ప్రశ్నలు సంధించారు.

హెచ్ఏఎల్, ఎల్ఐసీల గతిని మార్చింది మేమే

‘‘నేను స్వతంత్ర దేశంలో పుట్టాను. నా ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయి. నేను బానిసత్వానికి వ్యతిరేకం. ప్రభుత్వ రంగ సంస్థల్ని మేం నాశనం చేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీఎస్ఎన్ఎల్‌ను నాశనం చేసింది ఎవరు.. ? హెఏఎల్, ఎయిర్ ఇండియాను దెబ్బతీసింది ఎవరు ? ప్రస్తుతం హెచ్ఏఎల్ రికార్డు స్థాయి లాభాలను సాధిస్తున్నది నిజం కాదా ?’’ అని మోడీ పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో ఎల్ఐసీ ఎక్కడుంది.. ? ఇప్పుడు ఎల్ఐసీ షేర్ రికార్డు స్థాయిని అందుకుంది. 2014లో 234 పీఎస్‌యూలు ఉంటే ఇప్పుడవి 254కి చేరాయి. పదేళ్లలో పీఎస్‌యూల విలువ రూ.9.5 లక్షల కోట్ల నుంచి రూ. 17 లక్షల కోట్లకు చేరింది’’ అని ప్రధాని వెల్లడించారు.

Advertisement

Next Story