మన్మోహన్ సింగ్ స్ఫూర్తిప్రదాత.. ప్రధాని మోడీ ప్రశంసలు

by Hajipasha |   ( Updated:2024-02-08 14:09:46.0  )
మన్మోహన్ సింగ్ స్ఫూర్తిప్రదాత.. ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోని చట్టసభల సభ్యులకు మన్మోహన్‌ను స్ఫూర్తిప్రదాతగా అభివర్ణించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు పలుకుతూ ప్రధానమంత్రి ఈ కామెంట్స్ చేశారు. ఇటీవల పార్లమెంటులో ఒక కీలక బిల్లుపై ఓటు వేయడానికి మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్‌లో వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘రాజ్యసభలో ఆ బిల్లుపై ఓటింగ్‌లో అధికార పక్షమే గెలుస్తుందని మన్మోహన్‌కు తెలుసు. అయినా వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు వేయడం విధి నిర్వహణ విషయంలో మన్మోహన్‌కు ఉన్న అంకిత భావానికి నిదర్శనం. ఆ ఓటింగ్‌లో మన్మోహన్ ఎవరికి మద్దతిచ్చారనేది ముఖ్యం కాదు.. ఆయన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వచ్చారనేదే ముఖ్యమని నేను భావిస్తున్నాను. మన్మోహన్ తరహాలోనే చట్టసభ సభ్యులంతా విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన్మోహన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘మన్మోహన్ చిరకాలం జీవించాలి. ఆయన మాకు మార్గదర్శకుడిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని తెలిపారు. ‘‘సైద్ధాంతిక విభేదాలు స్వల్పకాలికం.. కానీ మన్మోహన్ సింగ్ ఈ సభకు, దేశానికి మార్గనిర్దేశం చేసిన విధానం, మన ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేసిన తీరు ఎప్పటికీ దేశ ప్రజలకు గుర్తుండిపోతుంది’’ అని మోడీ చెప్పారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ‘‘మంచి పనిని మెచ్చుకోవాలి.. చెడును విమర్శించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed