‘ఇండియా’ పురిటిగడ్డ నుంచే మోడీ ప్రచార శంఖారావం.. 13న తొలి సభ !

by Hajipasha |
‘ఇండియా’ పురిటిగడ్డ నుంచే మోడీ ప్రచార శంఖారావం.. 13న తొలి సభ !
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ‘ఇండియా’ను ఢీకొనేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది.‘ఇండియా’కు పునాదులు పడిన రాష్ట్రం బిహార్. ప్రతిపక్ష పార్టీల కూటమి తొలి మీటింగ్ జరిగింది అక్కడే. అందుకే ఆ రాష్ట్రం నుంచే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార శంఖాన్ని పూరించనున్నట్లు తెలుస్తోంది. ‘చంపారన్’ అనగానే దేశ స్వాతంత్రోద్యమ సమయం గుర్తుకు వస్తుంది. చంపారన్‌లోని బెట్టియాలో జరిగే భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచార ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుడతారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం బిహార్‌లో ఇండియా కూటమిలోని పార్టీల ప్రభుత్వమే ఉంది. అక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా ఎన్నికల సమరంలో అమీతుమీకి సిద్ధమేననే సంకేతాలను పంపాలని కమలదళం పెద్దలు యోచిస్తున్నారు.

నితీష్‌కు కమలదళం సవాల్..

ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న నితీశ్ కుమార్ ప్రస్తుతం బిహార్ సీఎంగా ఉన్నారు. త్వరలోనే ఆయనకు విపక్ష కూటమి కన్వీనర్ పదవి కూడా దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. ఈ విధంగా ఏ కోణంలో చూసినా.. ప్రతిపక్ష పార్టీల కూటమిలో మూలస్తంభంగా బిహార్ కనిపిస్తోంది. అందుకే అక్కడ ఇండియా కూటమిని బలంగా ఢీకొనాలనే పట్టుదలతో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. జనవరి 13న బిహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్, బెట్టియా, బెగుసరాయ్‌లలో నిర్వహించే మూడు ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని సమాచారం. ఈనెల 15న కూడా బిహార్‌లో పలు సభలు, సమావేశాలను నిర్వహించేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బిహార్‌లోని సీతామర్హి, మాధేపురా, నలందలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌లోని సీమాంచల్‌ ప్రాంతంలో పర్యటించనున్నారు.

Advertisement

Next Story