Pm modi: దేశంలో అసలైన అభివృద్ధి చేసి చూపించాం.. ప్రధాని మోడీ

by vinod kumar |
Pm modi: దేశంలో అసలైన అభివృద్ధి చేసి చూపించాం.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో అసలైన అభివృద్ధిని చేసి చూపించామని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం కేవలం నినాదాలకే పరిమితం కాలేదని, నిజమైన డెవలప్ మెంట్ చేశామని నొక్కి చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ మంగళవారం లోక్ సభలో ప్రసంగించారు. తమ ప్రభుత్వానికి ఇది మూడో పదవీకాలం మాత్రమేనని, వికసిత్ భారత్ లక్ష్యం కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటామన్నారు. ఐదు దశాబ్దాలుగా గరీబీ హఠావో స్లోగన్స్ విన్నామని కానీ అది కేవలం నినాదాలకే పరిమితమైందని విమర్శించారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించిందని చెప్పారు. పేద ప్రజలకు ఎంతో సేవ చేశామని వాటి గురించి రాష్ట్రపతి ప్రసంగంలో సుధీర్ఘంగా వెల్లడించామన్నారు.

వారికి పేదల బాధలు తెలియవు

గుడిసెలలో ఫోటో తీయించుకునే వారికి పేద ప్రజల సమస్యలపై చర్చించడం బోరింగ్‌గా ఉంటుందని ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమ సొంత వినోదం కోసం మాత్రమే కొంతమంది పేదల గుడిసెలలో ఫోటో సెషన్లు చేస్తుంటారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని జేబుల్లో పెట్టుకుని తిరిగేవారు ముస్లిం మహిళలను ఎప్పుడూ పట్టించుకోలేదని తెలిపారు. కులం గురించి మాట్లాడటం కొంతమందికి ఫ్యాషన్‌గా మారిందని, ఓబీసీ సమాజానికి రాజ్యాంగబద్ధమైన హక్కును ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమేని స్పష్టం చేశారు. ఎన్డీఏ మధ్యతరగతి ప్రజల పట్ల సానుకూలంగా ఉందని వారికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ పథకాల నుంచి 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను తొలగించామన్నారు. అణగారిన వర్గాలకు సహాయం చేయడానికి నైఫుణ్య మంత్రిత్వ శాఖనే సృష్టించామని గుర్తు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని, 2014 తర్వాత ఈ రంగం 10 శాతం వృద్ధిని సాధించిందని తెలిపారు.

రాజ్యాంగ స్పూర్తితోనే బలమైన నిర్ణయాలు

కొంతమంది అర్బన్ నక్సల్స్ భాషను బహిరంగంగా మాట్లాడుతున్నారు, భారత రాజ్యాన్ని వారంతా సవాల్ చేయడం దురదృష్టకరమన్నారు. ఈ తరహా భాష మాట్లాడే వారు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోరని మండిపడ్డారు. ఎన్డీఏ రాజ్యాంగ స్ఫూర్తితో జీవిస్తుందని అందుకే బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రాజ్యాంగం వివక్ష చూపే హక్కు ఇవ్వబోందని తెలిపారు. తమ ప్రభుత్వం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిరంతరం పనిచేస్తుందని, కానీ కొన్ని పార్టీలు యువతను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి వాటిని విస్మరిస్తున్నాయన్నారు. ఆప్ ఆద్మీ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన మోడీ పదేళ్లతో కోట్ల రూపాయలు ఆదా చేసి ప్రజల కోసం ఖర్చు చేశామని కానీ ఆ డబ్బును శీశ్ మహల్ నిర్మించడానికి ఉపయోగించలేదన్నారు.

Next Story

Most Viewed