Wayanad landslides: కేంద్రం నుంచి సాయం అందిస్తాం.. కేరళ సీఎంకు ప్రధాని ఫోన్

by Shamantha N |
Wayanad landslides:  కేంద్రం నుంచి సాయం అందిస్తాం.. కేరళ సీఎంకు ప్రధాని ఫోన్
X

దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాట్లాడినట్లు చెప్పారు. "వయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం బాధ కలిగించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికి సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిసున్నా" అని మోడీ అన్నారు. "బాధితులందరికీ సాయం చేయడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడా. కేంద్రం నుంచి సాధ్యమయ్యే అన్ని రకాల సహాయాలు అందజేస్తామని హామీ ఇచ్చా” అని మోడీ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ సంతాపం

కొండచరియలు విరిగిపడిన ఘటనపై తీవ్ర వేదన చెందానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. "వయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర వేదన చెందాను. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. బురదలో చిక్కుకున్న వారిని త్వరగా సురక్షితంగా తీసుకువస్తారని ఆశిస్తున్నా. కేరళ సీఎం, వయనాడ్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడా. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూడాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరా. ఏదైనా సహాయం కావాలంటే తెలియజేయాలని వారిని అభ్యర్థించా” అని సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ వెల్లడించారు. కేంద్ర మంత్రులతో మాట్లాడతానని.. వయనాడ్ కు సాధ్యమైన అన్నిరకాల సహాయాలు అందించాలని అభ్యర్థిస్తానని పేర్కొన్నారు. సహాయకచర్యల్లో అధికారులకు సహకరించాలని యూడీఎఫ్ కార్యకర్తలని కోరారు.

కేరళకు రెడ్ అలర్ట్

కేరళలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాసరగోడ్, కన్నూర్, వానాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానికులు, పర్యాటకులు చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

Advertisement

Next Story