పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు

by Harish |
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా మొదలు పెట్టేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ‘బాద్‌షాహీ మైండ్‌సెట్’ ఉండేదని చెప్పారు. బీజేపీ మాత్రమే సామాజిక న్యాయాన్ని విశ్వాసానికి మారుపేరుగా మార్చిందని అన్నారు. ఇది రాజకీయ నినాదం మాత్రమే కాకుండా ఎవ్వరి పట్ల వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరికి సహాయ పడేందుకు కష్టపడి పనిచేశామని చెప్పారు. తదుపరి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు.

అయితే అంతటితో సంతృప్తి చెందొద్దని ఆయన సూచించారు. 1980 నుంచి ఏ విధంగా పోరాడుతూ వస్తున్నామో.. అదే శక్తితో ప్రతి ఎన్నికల్లో పోరాడాలని ఆయన చెప్పారు. ‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించలేరని ప్రజలే అంటున్నారు. అదే నిజం. కానీ ఎన్నికల్లో గెలవడంతో పాటు ప్రతి ఒక్కరి హృదయాలను కూడా గెలవాలి. ఎన్నికల్లో గెలుపు వరకు పరిమితం కాకూడదు’ అని మోడీ అన్నారు.

మరోవైపు ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలు వలసవాద మనస్తత్వాన్ని వదులుకోలేదని.. ప్రజలను బానిసలుగా చూస్తున్నాయని చెప్పారు. ‘వాళ్లు ఎల్లప్పుడు ప్రజలను బాద్‌షాహీ మైండ్‌సెట్‌తో చూసేవారు. ప్రజలను వారు బానిసలుగా భావించేవారు. కానీ 2014లో ప్రజలు దీనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. నూతన భారత దేశం కోసం నాంది పలికారు’ అని మోడీ అన్నారు.

తనకు సమాధి తవ్వుతామన్న ప్రతి పక్షాల వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘ప్రతిపక్షాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. వారి అవినీతి కార్యకలాపాలను బహిర్గతం చేయడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నిస్సహాయ స్థితికి చేరారు. వాళ్లకు ఇంక ఒక్కటే మార్గం కనిపించింది. మోడీ తేరీ కబర్ ఖుదేగా అని బహిరంగంగా బెదిరించడం ప్రారంభించారు’ అని మోడీ అన్నారు.

గురువారం దేశమంతటా హనుమాన్ జయంతిని జరుపుకున్నారు. భక్తికి, బలానికి ప్రసిద్ధి చెందిన హిందూ దేవత నుంచి ప్రేరణ పొందాలని కార్యకర్తలను కోరుతూ మోడీ తన వర్చువల్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ’హనుమాన్ మాదిరిగా నేడు భారత దేశం కూడా తన ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఆయన తన కొరకు ఏమీ చేసుకోలేదు. కానీ రాక్షసులను ఎదుర్కొన్నప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించాడు. అలాగే మేము కూడా రాజవంశీకుల అవినీతి, శాంతి భద్రతలు వంటి సవాళ్లను ఎదుర్కొవాలని నిర్ణయించుకున్నాం. ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో మా వైఖరి కఠినంగానే ఉంటుంది’ అని ప్రధాని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed