సరిహద్దులో శాంతియుత వాతావరణమే లక్ష్యం

by Mahesh Kanagandla |
సరిహద్దులో శాంతియుత వాతావరణమే లక్ష్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, చైనా సరిహద్దుల్లో 2020లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నప్పటి నుంచి ఉభయ దేశాల అగ్రనాయకులు భేటీ కాలేదు. ఎల్ఏసీలో 2020కి పూర్వమున్న యథాస్థితిని కొనసాగించడానికి, పెట్రోలింగ్ చేపట్టడానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు కజాన్‌లో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఈ నాయకులు సమావేశమై ఎల్ఏసీలో పరిస్థితులపై చర్చించారు. ‘భారత్, చైనా సంబంధాలు ఈ రెండు దేశాల ప్రజలకు మాత్రమే కాదు.. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు, పురోగతికి ముఖ్యం. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నిత వైఖరి.. ద్వైపాక్షిక సంబంధాలకు ఛోదకశక్తిగా ఉండాలని’ అని ప్రధాని మోడీ అన్నారు.

ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించి, సుస్థిరత్వాన్ని సాధించాలని ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ రెండు దేశాల సత్సంబంధాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలవని పేర్కొన్నట్టు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల నాయకులు ప్రత్యేక ప్రతినిధులను సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించనున్నట్టు, ఈ ప్రత్యేక ప్రతినిధుల భేటీ వీలైనంత త్వరగా జరుగుతుందని మోడీ, జిన్‌పింగ్‌లు పేర్కొన్నట్టు వివరించింది.

ఇరువైపులా సహకారం అవసరం

రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలను, విభేదాలను పరిష్కరించుకుని ఒక దేశ అభివృద్ధి కాంక్షలకు మరో దేశం పాటుపడటానికి ఉభయ దేశాల మధ్య మరింత సహకారం, అనుసంధానం ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఐక్యతను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించడానికి ఈ రెండు దేశాలు కలిసి అడుగేయాలని వివరించారు. బహుళధ్రువ రాజకీయాల వైపుగా ముందుకు సాగడానికి, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి పని చేయాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed