195 @ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. కీలక విశేషాలివీ

by Hajipasha |
195 @ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. కీలక విశేషాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమర శంఖం పూరించింది. ఎట్టకేలకు 195 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్టును విడుదల చేసింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్‌డే ఈ లిస్టును రిలీజ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటవుతుందని తావ్‌డే విశ్వాసం వ్యక్తంచేశారు. తొలి జాబితాలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (గాంధీనగర్), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (లక్నో), ఐటీశాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (తిరువనంతపురం), ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ (పోర్​బందర్), స్మృతీ ఇరానీ (అమేథీ) సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లు ఉన్నాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (విదిశ), ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులకు కూడా ఈ లిస్టులోనే చోటు కల్పించారు. కేరళలోని త్రిసూర్‌ లోక్‌సభ స్థానం నుంచి సినీ నటుడు సురేశ్‌ గోపి పోటీ చేయనున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ జాబితాను విడుదల చేశారు.

51 మంది యూపీవారే..

తొలి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువత, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు లోక్‌సభ సీట్లను కేటాయించారు. రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌‌లోని 20, మధ్యప్రదేశ్‌‌లోని 24, గుజరాత్‌‌లోని 15, రాజస్థాన్‌‌లోని 15, కేరళలోని 12, తెలంగాణలోని 9, జార్ఖండ్‌లోని 11, ఛత్తీస్‌గఢ్‌లోని 12, ఢిల్లీలోని 5, జమ్మూకశ్మీర్‌‌లోని 2, ఉత్తరాఖండ్‌‌లోని 3, అరుణాచల్‌ ప్రదేశ్‌‌లోని 2, గోవా, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, డామన్‌ డయ్యూల నుంచి ఒక్కో లోక్‌సభ అభ్యర్థి పేర్లను బీజేపీ అనౌన్స్ చేసింది.అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు సీట్లకుగానూ ఒక సిట్టింగ్ స్థానం నుంచి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మరోసారి పోటీ చేయనున్నారు.

తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు వీరే..

తెలంగాణ నుంచి లోక్‌సభ టికెట్ దక్కించుకున్న తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాలో బండి సంజయ్‌కుమార్‌ (కరీంనగర్‌), ధర్మపురి అర్వింద్‌ (నిజామాబాద్‌), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌), మల్కాజిగిరి (ఈటల రాజేందర్‌), కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌), డాక్టర్‌ మాధవీ లత (హైదరాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), పి.భరత్‌ (నాగర్‌ కర్నూల్‌), బూర నర్సయ్య గౌడ్‌ (భువనగిరి) ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed