Rahul: బహుజన వ్యతిరేక బీజేపీ అబద్ధాలు వ్యాప్తి చేసినా.. రిజర్వేషన్లు దెబ్బతీయం

by Shamantha N |
Rahul: బహుజన వ్యతిరేక బీజేపీ అబద్ధాలు వ్యాప్తి చేసినా.. రిజర్వేషన్లు దెబ్బతీయం
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ బహుజన వ్యతిరేకి అని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. "బహుజన వ్యతిరేక బీజేపీ ఎన్ని అబద్ధాలు వ్యాప్తి చేసినా.. రిజర్వేషన్లను దెబ్బతీయనివ్వము" అని రాహుల్ అన్నారు. 'కుల గణన' అనే పదాన్ని చెప్పడానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. 'బహుజనులు' తమ హక్కులను పొందడం ఇష్టం లేదని సోషల్ మీడియా ఎక్స్ లో హిందీలో పోస్టు చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి సమగ్ర కులగణన జరిపాలని డిమాండ్ చేశారు. దేశంలోని బహుజన వర్గాలకు హక్కులు, వాటా, న్యాయం జరిగే వరకు ఆగేదిలేదన్నారు.

కులగణన రాజకీయ సమస్య కాదు..

కుల గణన రాజకీయ సమస్య కాదని.. బహుజనులకు న్యాయం చేయడమే తన జీవిత లక్ష్యం అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి కూడా కోరుకుంటుందని చెప్పారు. ఇకపోతే, ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్.. రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీంతో, ఆయన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది.

Next Story

Most Viewed