Stock Market: 85 వేలకు కొంచెం దూరంలో సెన్సెక్స్

by S Gopi |
Stock Market: 85 వేలకు కొంచెం దూరంలో సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగుతోంది. ఇప్పటికే వరుసగా ఆల్‌టైమ్ గరిష్ఠాల్లో ర్యాలీ చేస్తున్న సూచీలు సోమవారం మరో కీలక మైలురాయికి చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభిస్తున్న సానుకూల సంకేతాలు, ఇటీవలి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత తర్వాత విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించడం వల్ల మన మార్కెట్లు కొత్త రికార్డులను సాధిస్తోంది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 మార్కుకు చేరువగా నిలిచాయి. మిడ్-సెషన్ ప్రారంభంలో రికార్డు గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ ఆ తర్వాత దేశీయంగా ఇన్‌పుట్ ఖర్చుల తగ్గుదల, ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలు, పీఎంఐ డేటా నియంత్రణలో ఉండటం వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 384.30 పాయింట్లు ఎగసి 84,928 వద్ద, నిఫ్టీ 148.10 పాయింట్లు లాభపడి 25,939 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్ ఏకంగా 3 శాతానికి పైగా పుంజుకోగా, ఆటో, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. ఐటీ రంగం బలహీనపడింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు 1 శాతానికి పైగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.55 వద్ద ఉంది.

Next Story

Most Viewed